వైఎస్ జగన్ కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం సీఎం పోస్టు తనకే వస్తుందని ఆశించిన జగన్‌కు అధిష్ఠానం మొండి చేయి చూపింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తన తండ్రి నడిచిన "పాదయాత్ర" బాటలోనే పయనించడానికి జగన్ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
చేవెళ్ల నుంచి తన పాదయాత్రను ప్రారంభించి ఊరూరా తిరిగి తన తండ్రిలేని లోటును తాను భర్తీ చేస్తానని చెప్పదలుచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్‌ను పరామర్శించేందుకు భారీ జన సందోహం తరలి రావడం వైఎస్ శిబిరానికి కొత్త ఊపునిచ్చింది.
వైఎస్ జగన్ తన పాదయాత్రను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలు, గ్రామాల ద్వారా సాగుతుంది. పాదయాత్రలో భాగంగా తన తండ్రి మరణవార్త విని ఆత్మహత్యలకు, హఠణ్మారణాలకు గురైన కుటుంబాలను పరామర్శిస్తారని సమాచారం.
లక్షలాది కార్యకర్తల తోడుండగా జగన్ నిర్వహించే ఈ పాదయాత్ర వైస్సార్ శాశ్వత నిద్రలో ఉన్న ఇడుపులపాయ వద్ద ముగిస్తారని భోగట్టా. ఇదిలావుండగా జగన్ పాదయాత్ర వార్తపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. జగన్ తలపెట్టబోయే పాదయాత్ర నిజమైతే.. దానిని ఎలా నియంత్రించాలన్న అంశంపై అధిష్ఠానం దృష్టి సారించినట్లు భోగట్టా.