జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » రాష్ట్ర కాంగ్రెస్ నిట్టనిలువునా చీలిపోవడం ఖాయం...!! (K. Rosaiah | Chief Minister | YS Jagan Mohan Reddy | Congress | YSR,)
 
FILE
సీఎం సీటు విషయంలో వైఎస్ జగన్ అనుకూల వర్గం... ముఖ్యమంత్రి రోశయ్య వర్గం... అంటూ రెండు వర్గాలు క్రమంగా తమ రూపును సంతరించుకుంటున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ మెప్పు పొందాలన్న తహతహలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అధిష్ఠానానికి పరోక్ష హెచ్చరికలు చేస్తుంటే, ముఖ్యమంత్రి రోశయ్యకు తమ సంపూర్ణ మద్దతు ఉందని అధినాయకత్వాన్ని ఆకట్టుకునేందుకు కొందరు తంటాలు పడుతున్నారు. పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ రాష్ట్ర రాజకీయాలలో వేడిని రగిలిస్తున్నారు.

"రోశయ్యను అధిష్ఠానం ముఖ్యమంత్రిగా నిర్ణయించిందనీ, దీనికి అందరూ కట్టుబడి ఉంటే ఉండాలి. లేదంటే సదరు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయాల"ని ఎంపీ హర్షకుమార్ వైఎస్ జగన్ అనుకూల శిబిరంపై అస్త్రం విసిరారు.

ఇక పీసీసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు గత రెండు మూడు వారాలుగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని బాహాటంగా సమర్థిస్తూ వార్తల్లోకి ఎక్కారు. హర్షకుమార్ వ్యాఖ్యానాలకు తిరుగు టపాలను పంపిస్తూ చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరైతే, వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టకపోతే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని హెచ్చరికలు చేస్తున్నారు.

ఇక స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ... తరచూ ముఖ్యమంత్రులను మార్చే అలవాటు సోనియాగాంధీ గారికి లేదని చెపుతూ, పరోక్షంగా వైఎస్ జగన్‌కు సీఎం పోస్టు వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. మొత్తమ్మీద రోశయ్య వర్గం- జగన్ వర్గం అంటూ రెండు వర్గాలు క్రమంగా విడిపోతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఇలాగే మౌనరాగం ఆలపిస్తూ ఉంటే... రాష్ట్ర కాంగ్రెస్ పీలికలవడానికి ఎన్నో రోజులు పట్టవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.