దివంగత మాజీముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయకపోతే రాజీనామా చేస్తామని కొందరు, చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మరికొందరు మంత్రులు గత నెలరోజులుగా బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దృష్టి సారించినట్లు భోగట్టా.
ముఖ్యమంత్రి రోశయ్యతో కలిసి రాష్ట్రంలో వరద పరిస్థితిని సమీక్షించిన అనంతరం, మంత్రుల సహకారం ఎలా ఉందని ముఖ్యమంత్రిని సోనియా అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం సమాధానం ఏమి చెప్పి ఉంటారన్నది ప్రక్కనపెడితే... రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, పరిపాలనను మరింత పటిష్టపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా సోనియాగాంధీ ముఖ్యమంత్రికి సూచించినట్లు భోగట్టా.
ఇందులో భాగంగా అవసరమైతే క్యాబినెట్ రూపాన్ని మార్చుకోమని సోనియాగాంధీ నిర్దేశించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో యువకులకు చోటివ్వటం ద్వారా ప్రభుత్వ పనితీరు మరింత చురుకుగా, వేగవంతం చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సలహా ఇచ్చినట్లు సమాచారం.
ఇదిలావుండగా రాష్ట్రమంత్రివర్గంలో సాధ్యమైనంత త్వరగా మార్పులు చేర్పులు చేయాలని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం, పీసీసి చీఫ్ డి.శ్రీనివాస్ మేడమ్ వద్ద నొక్కి వక్కాణించినట్లు సమాచారం. ఏరియల్ సర్వేలో పాల్గొన్న సమయంలో మంత్రి చిదంబరం, డిఎస్ సోనియాగాంధీతో రాష్ట్రంలోని పరిస్థితులను పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో వరద పరిస్థితి చక్కబడిన తర్వాత తగిన మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్షాళనలో తిరుగుబావుటా ఎగురవేసి, అధిష్టానాన్ని ఇరుకునపెట్టినవారి పీఠం లాగేయడం ఖాయమనే వార్తలు వినబడుతున్నాయి.