ఐదు జిల్లాల్లోని నదీతీర ప్రాంతంలో ఉన్న పట్టణాల్లోని ప్రజలను చుట్టిముట్టి బంధించి, కొందరి ప్రాణాలను కబళించి... గూడు- గుడ్డ, గొడ్డు- గోదను తన గర్భంలో కలిపేసుకుంది వరద గంగమ్మ. తీరని ఆ శోకాన్ని దిగమింగుకుని ఎలాగో బతుకు వెళ్లదీద్దామనుకునే వరద బాధితులను ఆదుకునే నాథుడేడీ...?
ప్రభుత్వం మాట అటుంచితే ఇదిగో మేమున్నామంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలు రంగంలోకి దూకాయి. ప్రింట్ అండ్ వెబ్ మీడియా సంగతేమోగానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం బాధితులకు నేరుగా సహాయాన్ని అందిస్తామని ముందుకు ఉరికింది. విరాళాలు పంపండి... బాధితులను ఆదుకుందాం. అంటూ ఆయా ఛానళ్లు హోరెత్తిస్తున్నాయి.
దాతలు సైతం స్పందించి పెద్ద మొత్తంలో విరాళాలను పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకూ బాగానే ఉంది. మరి వచ్చిన విరాళాలు బాధితులకు అందుతున్నాయా..? అని నేరుగా బాధితులనే ప్రశ్నిస్తే రిక్త హస్తాలను చూపుతున్నారు. వరద తాకి ఐదు రోజులు కావస్తున్నా తమ వైపు తొంగి చూసినవారే లేరని వాపోతున్నారు. మరి వచ్చిన విరాళాలను ఆయా ఛానళ్లు ఎవరికి ఇస్తున్నదీ ప్రజలకు ప్రత్యక్షంగా చూపెట్టగలిగితే బావుంటుందంటున్నారు వరద బాధితులు.
ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే... ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రింట్ మీడియా తమకు అందిన విరాళాలన్నింటినీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించేది. కానీ ఇప్పుడు ఆ వరస మారింది. ఎలక్ట్రానిక్ మీడియా ఒక అడుగు ముందుకు వేసి, బాధితులను తామే ప్రత్యక్షంగా ఆదుకుంటామనీ, విరాళాలను తమకు పంపండని ప్రకటిస్తోంది. అలా వచ్చిన విరాళాలు ఎవరికి... ఎక్కడ ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. వరద బాధితులు మాత్రం తమకు ఎలాంటి సహాయం అందలేదని తేల్చి చెబుతున్నారు.
ఇక ప్రభుత్వ సాయం సంగతి చూస్తే... బాధితుని గోడు వరద గంగమ్మకే ఎరుక అన్నట్లు ఉంది. ఉన్న ఇళ్లు వరద ఊడ్చుకుపోగా... సాయంకోసం చేయి చాచితే రేషన్ కార్డు అడిగే దుస్థితి దాపురించింది. వరద ఉరవడిలో ఊళ్లకు ఊళ్లే కొట్టుకపోతే... ఎలాగో వరదకు ఎదురీది ప్రాణాలను కాపాడుకుని ఒడ్డున పడ్డ బాధితులు రేషన్ కార్డును భద్రంగా పట్టుకురావాలన్నమాట. కార్డు లేకపోతే ప్రభుత్వ సాయం "సున్నా" అనే కదా అర్థం.
మొత్తమ్మీద చూస్తే... పుట్టెడు దుఃఖంలో కొట్టుకలాడుతున్న వరద బాధితులకు అన్నిచోట్లా మొండి చెయ్యే కనబడుతోంది. వెనకటికి మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు "ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా.." అన్నట్లు తమ పరిస్థితి ఉందని వరద బాధితులు వాపోతున్నారు.