జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » వైఎస్‌జెకు సీఎం పదవి స్వప్నంగానే మిగలనుందా...? (Andhra Pradesh, Congress party, Chief Minister | Y S Jaganmohan Reddy | Delhi | Compromise formula)
Feedback Print Bookmark and Share
 
ఎట్టకేలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పయనమై వెళ్లారు. ఎందుకు వెళ్లారు...? ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం ఏ పదవి కట్టబెట్టబోతుందనే సస్పెన్స్‌కు జగన్ ఢిల్లీ యాత్రతో తెరపడే అవకాశం ఉన్నది. అయితే ఇప్పటికే వైఎస్ జగన్‌కు కేంద్ర సహాయమంత్రి పదవిని కట్టబెట్టే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

రోశయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పూర్తికాలంపాటు కొనసాగించాలని కేంద్రం గట్టిగా నిర్ణయించుకున్నట్లు భోగట్టా. మొత్తమ్మీద జగన్‌ను ఎలాగోలా బుజ్జగించి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎటువంటి బేధాలు తలెత్తకుండా చూసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం బాగా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేవీపి రామచంద్రరావుకి వైఎస్ జగన్‌కు ఇవ్వదలచిన పదవి... తదుపరి అనుసరించాల్సిన అంశాలపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.

వైఎస్ జగన్‌కు ఏదో ఒక శాఖకు సంబంధించి కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టిన అనంతరం కాంగ్రెస్ హైకమాండ్‌కు వ్యతిరేకంగా తమ స్వరాలను పెంచుతున్న కొందరు రాష్ట్రమంత్రులపై వేటుకు రంగం కూడా సిద్ధమైనట్లు భోగట్టా. ఇప్పటికే తిరుగుబావుటా నినాదాలు చేసిన మంత్రుల చిట్టా అధిష్ఠానం చేతుల్లో ఉంది. ఏయే మంత్రులకు ఉద్వాసన పలకాలన్న అంశంపైనా కేంద్రం ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం.

జగన్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యను ఢిల్లీకి పిలిపించి, వ్యతిరేక మంత్రులకు ఉద్వాసన కార్యక్రమం ప్రారంభిస్తారని తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసిన అనంతరం నవంబరులో సీఎల్పీని సమావేశపరిచి కె. రోశయ్యను సీఎల్పీ నేతగా ఎన్నుకుంటారని సమాచారం. అయితే ఇదంతా కాంగ్రెస్ అధిష్ఠానం యోచన.

ఒకవేళ వైఎస్ జగన్ అధిష్ఠానం విన్నపాన్ని తిరస్కరించి, తనకు ముఖ్యమంత్రి పదవే కావాలని పట్టుబట్టినట్లయితే పరిస్థితులు మారిపోవచ్చు. ఇప్పటివరకూ వైఎస్ జగన్‌కు సంపూర్ణ మద్దతు పలుకుతున్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వేరు కుంపటి పెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో తలెత్తే అవకాశమే లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ వర్గం మాత్రం తమ నేతకు సీఎం పీఠం ఖాయం అన్న ధీమాలో ఉంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.