జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » "మహానగరి" పోరు.. ప్రరాపాకు ఓ అగ్నిపరీక్ష! (Chiru | PRP | GHMC | Election | Candidates | Divisions | Future | Win)
Feedback Print Bookmark and Share
 
File
FILE
భారీ అంచనాలతో రాష్ట్ర రాజకీయ అరంగేట్రం చేసిన వెండితెర మెగాస్టార్ చిరంజీవికి ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. "మార్పు", "సామాజిక న్యాయం" అనే రెండు ప్రధాన నినాదాలతో రాజకీయ కెరటంలా వచ్చిన చిరంజీవి ఇపుడు పరువుకోసం పాకులాడుతున్నారు. ఇందుకోసం పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేస్తూ ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు ఆ పార్టీకి ఒక అగ్నిపరీక్షలా మారాయి.

ఈ ఎన్నికల్లో ఆ పార్టీ చూపించే సత్తా ఆధారంగానే పార్టీ భవిష్యత్ ఉంటుందో లేదో అంచనా వేయవచ్చు. అయితే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు దక్కించుకుని పరువు నిలుపుకోవాలని చిరంజీవితో పాటు.. ప్రరాపా నేతలు గట్టిపట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం గ్రేటర్ పరిధిలో ఉన్న 150 డివిజన్లలో పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. అదేసమయంలో భావ సారూప్యత ఉన్న ఇతర పార్టీలతో పొత్తుకూ సై అంటోంది.

చిరంజీవి రాజకీయ పార్టీ పెడతారంటూ వచ్చిన వార్తలు రాష్ట్ర మీడియాలో ఓ సంచనం సృష్టించాయి. ఆ తర్వాత ప్రజల్లో ఓ ఉత్తేజాన్ని నింపాయి. అనుకున్నట్టుగానే చిరంజీవి ఏర్పాటు చేసిన తొలి బహిరంగ సభకు లక్షలాది జనం స్వచ్ఛంధంగా తరలి వచ్చారు. ఆ తర్వాత చిరంజీవి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బహిరంగ సభలకు భారీగా జనం కదిలి వచ్చారు. అయితే ఓట్లు వేసేందుకు మాత్రం వారు ఆసక్తి చూపలేదు. ఫలితంగా 18 సీట్లకే పరిమితమై ఊసురుమనిపించింది.

సాక్షాత్ చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట మాత్రమే నెగ్గగలిగారు. ఆ తర్వాత ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు అనేక నేతలు గుడ్‌బై చెప్పారు. ఇలాంటి వారిలో డాక్టర్ మిత్రా, పరకాల ప్రభాకర్, ఆంజనేయ రెడ్డి, పి.శివశంకర్ కీలకం. అలాగే, ఇతర పార్టీల వలస వచ్చిన నేతలు సైతం తిరిగి తమ సొంత గూటికే చేరుకున్నారు. వీరితో పాటు ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన సోదరులు పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబు సైతం పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. టిక్కెట్ల పంపిణీలో అన్నీ తానే ముందుండి నడిపించిన చిరు బావమర్ధి అల్లు అరవింద్‌ను పూర్తిగా పక్కన పెట్టారు.

ఈ నేపథ్యంలో.. అధికారం, నిధులు లేని పరిస్థితుల్లో పార్టీని ఐదేళ్ళూ నడిపించడం చిరంజీవికి కత్తిమీద సాములాంటిందే. ఫలితంగా పార్టీ శ్రేణుల్లోనూ కొంత నిరుత్సాహం ఆవహించింది. పైపెచ్చు.. ప్రరాపా ఆధ్వర్యంలో అడపా దడపా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా అంతంతమాత్రంగానే స్పందన వస్తోంది. అయితే, ఐదు జిల్లాల వరద బాధితులను ఆదుకునేందుకు విశాఖ జిల్లాలో చిరంజీవి చేపట్టిన "జోలె యాత్ర"కు మాత్రం విశేష స్పందన రావడం గమనార్హం.

ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా గౌరవనీయమైన సంఖ్యలో అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజారాజ్యం పార్టీ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం సానుభూతి పవనాలు బలంగా వీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రరాపాకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.