జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » జగన్‌కు పీసీసి పదవి దక్కుతుందా? లేదా? (YS Jagan | PCC | DS | Rosaiah | Kesava Rao | VH | YSR | Helicapter | Accident | Regional)
Feedback Print Bookmark and Share
 
FILE
జగన్మోహన్‌ రెడ్డికి పీసీసి చీఫ్ పదవి దక్కుతుందా? లేదా? ప్రస్తుత పీసీసి చీఫ్‌ ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభ కోరుకుంటున్నారా? ఆయన రాజ్యసభకు వెళితే ఆ పదవి ఎవరిని వరిస్తుంది? అధిష్టానంతో చనువుగా ఉన్నంత మాత్రాన పీసీసి పదవి వస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి ఏఐసీసి చేస్తున్న ఆలోచన ఏమిటి? ఇవన్నీ కాంగ్రెస్‌ నాయకులను పట్టి పీడిస్తున్న ప్రశ్నలు. ఇందులో ఏది సాధ్యమవుతుంది. ఎంత వరకు అవకాశాలున్నాయి.

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దేశంలోనే కాంగ్రెస్‌కు బలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రూపు దిద్దుకుంది. అయితే వైఎస్‌ మరణం తరువాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న బెంగ అధిష్టానాన్ని పట్టి పీడిస్తోంది. వైఎస్‌ ఉన్నంత కాలం రాజకీయ అస్త్రసన్యాసం చేసిన నాయకులు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు.

వైఎస్‌ జగన్‌ను అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అంతా అధిష్టానమేనని హడావుడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ బాధ్యతలు రోశయ్య చేతుల్లోనే ఉంచింది. అయితే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

వైఎస్‌, డీఎస్‌ల జోడీ ఫలవంతమైందిగా ముద్రపడింది. ఎన్నికల తరువాత ఆ పదవి నుంచి రాజ్యసభకు వెళ్లాలని డీఎస్‌ భావించారు. వైఎస్‌ ఉన్నంతకాలం ఆ పదవిలో ఉంటూ ఇతర పార్టీల నాయకులకు వల వేయడంతో డీఎస్‌ కూడా కీలక పాత్ర వహించారు. అయితే వైఎస్‌ మరణం తరువాత నేరుగా అధిష్టానంతో సంబంధాలు నెరిపే వారి సంఖ్య అధికమైంది.

ఇలాంటి పరిస్థితులలో పీసీసీ అధ్యక్షుడుగా తాను కూడా పలచన అవుతాననే భావనకు వచ్చారు. వీలైనంత త్వరగా రాజ్యసభకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు. అధిష్టానం చుట్టూ ప్రదిక్షణలు చేస్తూ జనానికి దూరంగా హైఫై రాజకీయాలు చేసే నాయకుల హవా పెరుగుతోంది.

అయితే ఈపరిస్థితులలోఅధిష్టానం ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేసే పరిస్థితిలో లేదు. ఇదే అలుసుగా భావించిన హై...ఫై.... నాయకులు పీసీసి పదవికి వల వేస్తున్నారు. జగన్‌ను కేంద్ర మంత్రి వర్గానికి పంపి రాష్ట్ర రాజకీయాలలోకి రావాలనుకునే వారి జాబితాలో కే.కేశవరావు ముందు వరుసలో ఉన్నారు. ఈయనతో పాటు వెంకటస్వామి, వి.హనుమంతరావు ఇదే వరుసలో ఉన్నారు.

అయితే వైఎస్‌ది చాలా బలమైన వర్గం అనే విషయం అధిష్టానానికి చాల స్పష్టంగా తెలుసు. ఒక బలమైన వర్గం బలహీనపడితే పార్టీకి కూడా పెద్ద నష్టం వాటిల్లినట్లే అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. పైగా ఒక వైపు సానుభూతి, మరోవైపు జగన్‌కున్న జనాకర్షణ ఉన్న యువనాయకుని కాదని పీసీసి వీరికి ఇస్తే ఎలా? అనే అంశంపై అధిష్టానం చాలా సీరియస్‌గా ఆలోచిస్తోంది.

హై...ఫై.... నాయకులకు ఇస్తే తమతో లాయల్‌గా ఉంటారు... కానీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమవుతుందోననే బెంగ కూడా ఉంది. పైగా ఈ పర్యాయం రాష్ట్రంలో యువ ఎమ్మెల్యేలు, నాయకులు చాలామంది తెరపై కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో అనుభవం ఉన్న రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు పీసీసి యువరక్తానికి కేటాయిస్తే బాగుంటుందన్న వాదనలు అధిష్టానికి చేరాయి. ఇలాంటి పరిస్థితులలో మేడంకు విధేయత కలిగిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడు, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేరు ప్రతిపాదన వచ్చింది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పీసీసి పదవిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడిందనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. అధిష్టానం ఏం చేస్తోందో తెలుసుకోవడానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.