జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » జగన్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం అనుకూలమా? వ్యతిరేకమా? (Jagan | Congress | Sonia | PCC Chief | CM | CLP | Cabinet | Chiranjeevi | YSR)
Feedback Print Bookmark and Share
 
FILE
యువనాయకుడు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతారా? కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు అనుకూలమా? వ్యతిరేకమా? అసలు అధినేత్రి సోనియా మనసులో ఏముంది? రోశయ్య ఎంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారు? సీఎల్‌పీ సమావేశం ఎప్పుడు జరుగుతుంది? జరిగితే ఎవరు సీఎల్పీ లీడరవుతారు? రోశయ్య మంత్రి వర్గ విస్తరణ చేపడతారా? చేపడితే ఎవరెవరికి అవకాశం ఉంటుంది?.... ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను తొలచేస్తున్నాయి. అయితే అన్ని ప్రశ్నలకు కాంగ్రెస్‌ అధినాయకురాలి మస్తిష్కంలో సమాధానాలు చాలా పదిలంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి మృతి తరువాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయినంత పనయ్యింది. వైఎస్‌ మృతి తర్వాత వృద్ధనాయకులు జవసత్వాలను కూడదీసుకుని అధిష్టానం ఎదుట వాలిపోయారు. వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కకుండా ఉండడానికి ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. వారసత్వ పదవుల పేరుతో నానా హంగామా చేశారన్నది మరో విమర్శ. సాధారణంగానే అధికారం పక్కన వాలిపోయే వారెవరో కూడా తేలిపోయింది. ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు...

సీఎం పదవి ఇప్పట్లో తనను వరించే పరిస్థితి లేదని జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా చెప్పే పరిస్థితి సోనియా కల్పించారు. దీంతో అధిష్టానం దృష్టిలో జగన్‌కు అంత లేదని వ్యతిరేక వర్గాలు చంకలు గుద్దుకుంటున్నాయి. దీనిపై అంచనా వేయడానికి రాజకీయ పరిశీలకులు కసరత్తు చేస్తున్నారు. అధిష్టానం వద్ద జగన్‌కు స్థానం ఏంటి? న్యూస్‌ ఛానెళ్ల సంఖ్య పెరిగే కొద్ది మేధావులు రాత్రికి రాత్రే పుట్టుకొస్తున్నారు. ఇందులో ఎవరికి తోచింది వారు చెపుతున్నారు. జగన్‌ పని అయిపోయిందని చెపుతున్నారు. ఇందులో విశ్లేషణ ఎంత ఉందో తెలియదు కాని వారిమాటలు వింటే మాత్రం నిజమేననిపిస్తుంది.

కాంగ్రెస్‌ పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా అధిష్టానికి విధేయుడుగా ఉండాల్సిందే. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచే వారు కావాలి. అంటే జనాకర్షణ ఉన్న నాయకుడు. జనంలో పలుకుబడి కలిగిన మాస్‌ లీడర్‌ కావాలి. ఉన్న ఒక్క రాజశేఖర్‌ రెడ్డి మృతి చెందారు. ఆ తర్వాత అంతటి జనాకర్షణ ఉన్న నాయకుడెవరు? ఇది నేడు అధిష్టానం ఎదుట ఉన్న మిలియన్‌డాలర్ల ప్రశ్న. మహా అంటే నియోజకవర్గం దాటి పక్క నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే వారు ఉండవచ్చు. అంతకు మించిన నాయకుడెవరు? ఇవన్నీ అధిష్టానానికి తెలియదా?

సరే రాజశేఖర్‌ రెడ్డి తరువాత మాస్‌లో పలుకుబడి కలిగిన వ్యక్తులు ఇద్దరు ఒకరు చిరంజీవి. రెండో వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి. చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో లేరు. ఇక ఉన్నది వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒకరే. ఇలాంటి వ్యక్తిని దూరం చేసుకునేంత మూర్ఖత్వంగా కాంగ్రెస్‌ అధిష్టానం వ్యవహరిస్తుందా? అలాంటపుడు జగన్మోహన్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? వెంటనే వెలువడే ప్రశ్న ఇది.

ఈ ప్రశ్న సంగతి ప్రక్కన పెడితే... చంద్రబాబులాంటి రాజకీయ చాణక్యత ఉన్న వ్యక్తి, మాస్‌ ఆకర్షణ ఉన్న చిరంజీవి అసెంబ్లీలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా ఏం చేస్తారు. ఉన్న ఆశలను అడుగంటి పోయేలా చేసుకుంటారా? ఏ రాజకీయ అనుభవం ఉన్నా కాదనే చెపుతారు. సరిగ్గా కాంగ్రెస్‌ అధిష్టానం కూడా అదే ఆలోచించిందని విశ్లేషకులు చెపుతున్నారు. కాకపోతే వెంటనే నిర్ణయాన్ని ప్రకటిస్తే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధిష్టానం ఆలస్యం చేసి ఉండవచ్చు.

జగన్‌పై వ్యతిరేకత ఉంటే సోనియా దాదాపు గంటన్నర సేపు మాట్లాడతారా? కాబట్టి భవిష్యత్తు నాయకుడు జగనే కావచ్చన్న ఊహ బలంగా ఉంది. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. సోనియాను కలిసిన తరువాత ఇదే సంకేతాలను జగన్‌ ఇచ్చారు. మరి అధిష్టానం జగన్‌కు అనుకూలమా? వ్యతిరేకమా?.

ఇక సీఎల్‌పీ నాయకుడుగా సీఎం రోశయ్య అవుతారు. అయితే ఫ్లోర్‌ లీడర్‌గా తెలంగాణకు చెందిన నాయకుడు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణ వాదులను సంతృప్తి పరచడానికి మాత్రమే. దీనికి ప్రముఖంగా జానారెడ్డి పేరు వినిపిస్తోంది. సీఎల్‌పీ సమావేశం కూడా త్వరలో నిర్వహించే అవకాశాలున్నాయి.

మంత్రులు చాలా మంది రోశయ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితులలో మంత్రివర్గ విస్తరణ ఎలా ఉంటుందనే విషయంపై కూడా అంచనాలు జరుగుతున్నాయి. అయితే వైఎస్‌ జగన్‌ వర్గానికి వేటు పడుతుందని అందరూ భావిస్తున్నారు. పార్టీ బాధ్యతలు ఇచ్చే పరిస్థితులలో మంత్రి వర్గ విస్తరణ జగన్‌కు తెలియకుండానే జరుగుతుందా? ప్రభుత్వం, పార్టీలకు సమప్రాధాన్యత నడిచే అవకాశం ఉందని పరశీలకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో జగన్‌కు ఉండాల్సిన ప్రాధాన్యత జగన్‌కు ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఇవన్నీ ఇలా ఉంటే... తాజాగా కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా జగన్ శిబిరాన్ని ఓ కుదుపు కుదిపింది. రాజీనామా నిర్ణయంపై జగన్ శిబిరంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్తులో ఇటువంటి దూకుడు రాజీనామాలు మరిన్ని చోటుచేసుకుంటే.. అది వైఎస్ జగన్‌కు లాభం చేకూరుస్తుందో... లేదంటే చేటు తెస్తుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.