రాష్ట్రంలో రాజకీయ క్రీడ ఆరంభమైంది. కాంగ్రెస్‌లోని ఓ వర్గం వైఎస్.జగన్మోహన్ రెడ్డికి అడ్డుకట్ట వేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ఈ గేమ్‌లో గెలిస్తే వారికొచ్చే లాభం ఏంటి? ఓడిపోతే ఎవరు నష్టపోతారు? ప్రజారాజ్యం పార్టీకి జరిగే మేలేంటి? ఈ పరిణామాలకు ఎక్కడ బీజం పడింది. సూత్రధారి ఎవరు? ఇంత డేంజరస్ పొలిటికల్ గేమ్ ఆడాల్సిన అవసరమేమొచ్చింది...?
వైఎస్ మృతి తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సర్దుబాటలోనే ఉన్నప్పటికీ పార్టీలోని వర్గాలు ఒకరిపై ఒకరు పట్టు సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. జగన్‌ను అడ్డుకోవడానికి సీనియర్లు పడరాని పాట్లు పడుతున్నారు. అందరూ సీనియర్లే. అయితే జనాన్ని మెప్పించే నాయకుడు లేడు. తమకున్న పాత పరిచయాలతో జగన్‌ను అడుగడుగున అడ్డుకున్నారు. సీఎం కాకుండా చేశారు. ఇంతటితో ఆగనివారు జగన్‌కు ఏ పదవి దక్కకుండా చేయడానికి ఎత్తులు వేస్తున్నారు. ఈ చర్యలతో ఖంగుతిన్న జగన్ వర్గం డిఫెన్స్‌లో పడింది.
ఇంతలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానే వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 లక్షల ఓట్ల వరకూ ఖాతాలో వేసుకున్న ప్రజారాజ్యం పార్టీకి వైఎస్ అప్పట్లోనే వల వేశారు. మొదట ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మాట్లాడారు. ఆ తరువాత ఏకంగా చిరంజీవితోనే మంతనాలు జరిపినట్లు సమాచారం. అదే అదునుగా భావించిన సీనియర్ల జట్టు ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలలో చిరంజీవితో పొత్తుకు నాంది పలికింది. దీని వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉంది.
చిరంజీవిని జగన్‌కు ప్రత్యామ్నయంగా అధిష్టానానికి చూపనున్నారు. శాసనసభ ఎన్నికలలో భాగంగా ఘోరంగా దెబ్బతిన్న ప్రజారాజ్యం కూడా ఎవరో ఒకరితో పొత్తుకే మొగ్గు చూపుతోంది. ఇది ఉభయతారక మంత్రం అని ఇరుపార్టీలు భావిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలలో ఉభయతారక మంత్రం వికటిస్తే...?
ఎవరు ఏమన్నా ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చిన జనం, నాయకులలో చాలా మంది కాంగ్రెస్ వ్యతిరేక భావాలు కలిగిన వారే. వారు బేసిక్‌గా కాంగ్రెస్ వ్యతిరేకులు తెలుగుదేశం విధానాలతో సంతృప్తి చెందని వారు. ఇలాంటి వారికి కాంగ్రెస్‌తో పొత్తు రుచిస్తుందా? వారి ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితులలో కొంతైనా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ లాభపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రెండు పార్టీలు కలిసి పోటీ చేసి గెలిస్తే కాంగ్రెస్ సీనియర్ల మరింత బలపడినట్లే. అలా కాకుండా ఉభయతారక మంత్రం విఫలమైతే ఎక్కువగా నష్టపోయేది ఎవరు? సీనియర్లకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు.
ఇప్పటికే వారు రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారు. ఆ చేదు అనుభవాలను రాజకీయ జీవితాన్ని ఆరంభించిన చిరంజీవి చవి చూడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో జగన్‌ను వారంతట వారే కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా తయారు చేసినట్లువుతుంది. ఇది ఒక రకంగా ప్రమాదకర వ్యూహమే. అయినా సీనియర్ల ఎదుట ఉన్న ఏకైక మార్గం.
ఇకపోతే చిరంజీవి భవిష్యత్తు. గెలిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇదేమంత్రం.... మరో ఐదేళ్ళు తమదే హవా. ఇదీ సీనియర్ల వ్యూహరచన. దీనిపై జగన్ వర్గం చాలా సునిశితంగా పరిశీలిస్తోంది. నోరు మెదపలేని స్థితిలో ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఫలితం కోసం మనం కూడా గ్రేటర్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ వేచి చూడల్సిందే.