జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » టార్గెట్ 2014 ఎన్నికలు: "చిరు"పై కాంగ్రెస్ చూపు! (Chiranjeevi | Prajarajyam | Congress | 2014 elections | Andhra Pradesh)
Feedback Print Bookmark and Share
 
WD
రాష్ట్ర రాజధాని గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్- ప్రరాపా పొత్తు కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం రేపింది. ఉన్నట్లుండి పీసీసీ చీఫ్ డీఎస్ ప్రజారాజ్యంతో కలసి గ్రేటర్ ఎన్నికలకు వెళ్లబోతున్నామన్న ప్రకటన పెను సంచలనాన్ని సృష్టించింది. అసలు మెగాస్టార్ చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవలసిన అవసరం.. అగత్యం ఉందా..? అంటే లేదనే చెప్పవచ్చు. అయినా ఇరు పార్టీల నేతల మధ్య ఎందుకీ పొత్తు చర్చలు చోటుచేసుకున్నాయి...? అని చూస్తే రకరకాల కథనాలు వెలుగు చూస్తున్నాయి.

వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణానంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన ముఖ్యమంత్రి రోశయ్యను తోసిరాజని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుగుబావుటా ఎగురవేశారు. వైఎస్ జగన్ అంశంలో అధిష్టానం యోచన ఏమిటన్నది తెలియకుండానే నేరుగా జగన్ తదుపరి సీఎం అని ప్రకటించేశారు. ఇందులో భాగంగా కొన్నిచోట్ల అధినేత్రి సోనియాగాంధీ పోస్టర్లు చించివేత వంటి కార్యక్రమాలకు పరోక్షంగా సాయపడ్డారు.

మరోవైపు ముఖ్యమంత్రి రోశయ్యను ఖాతరు చేయని మంత్రులు తమదైన స్టేట్మెంట్లను ఇవ్వడం మామూలైపోయింది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ముఖ్యమంత్రి రోశయ్య అందరనీ కలుపుకుపోతానని చెపుతున్నప్పటికీ ఆయనతో కలిసి పనిచేసేటందుకు కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు రుచించలేదు. ఈ స్థితిలో జగన్ ఢిల్లీ యాత్ర చేశారు. ఆ యాత్రతో ఆయన సీఎం అభ్యర్థిత్వంపై అనుమానాలు తొలగిపోయాయి.

అంతే.. ఆ తదుపరి కొండా సురేఖ రాజీనామా చేయడమే కాక తమ సొంత పార్టీలోనే కొందరు నేతలు జగన్‌ను సీఎం కానివ్వకుండా అడ్డుపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వీటన్నింటిని నిశితంగా గమనించిన అధిష్టానం తిరుగుబావుటా ఎగురవేసే కాంగ్రెస్ నాయకుల నోళ్లకు తాళం వేసే దిశగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అదేమంటే... వచ్చే 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయి నాయకునిగా మెగాస్టార్ చిరంజీవిని నిలబెట్టడం. ఎందుకంటే... మెగాస్టార్ చిరంజీవి ప్రజాకర్షణగల నాయకుడు కావడం. ప్రజలను ఆకట్టుకున్న వైఎస్సార్‌ స్థానాన్ని భర్తీ చేయగల ప్రత్యామ్నాయంగా చిరంజీవి కాంగ్రెస్ అధిష్టానానికి కనిపించినట్టు సమాచారం.

ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా తెలుగుదేశాన్ని ధీటుగా ఎదుర్కొనవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు భోగట్టా. ఇందులో భాగంగా పీఆర్పీని నేరుగా విలీనం చేసుకోక తొలుత పొత్తులతో స్నేహం మొదలుపెట్టాలన్నది ఆలోచన. ఆ తర్వాత క్రమంగా చిరంజీవి పూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా అవతారమెత్తుతారని సమాచారం.

కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారన్న విషయాన్ని ప్రక్కనపెడితే.. 2014 ఎన్నికల నాటికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తిస్థాయి నాయకుడుగా ఉంటారని విశ్వసనీయ సమాచారం. అయితే అసలు నిజం ఏమిటో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎటువంటి పొత్తులు, నిర్ణయాలు, ఆలోచనలు వెలికి వస్తాయో చెప్పలేం కదా...!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.