దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి మెగా భయం పట్టుకుంది. తమ ప్రియతమ నేత వైఎస్సార్ అంతటి ఛరిష్మా కలిగిన రాజకీయ నేత రాష్ట్ర కాంగ్రెస్‌లో భూతద్దం వేసి గాలించినా కనిపించరు. అయితే, వైఎస్‌లాంటి ఛరిష్మా, మాస్‌ను ఇట్టే ఆకర్షించగలిగే నేత తమ పార్టీలో లేకపోయినా.. మరో పార్టీ అధినేత చిరంజీవి రూపంలో ఉన్నారనే విషయాన్ని పసిగట్టింది.
అందుకే చిరుతో పీసీసీ చీఫ్ డీఎస్ వేసిన స్నేహాస్తం ఎత్తుడను ఆదిలోనే అడ్డుకుంది. చిరంజీవికున్న ప్రజాకర్షణను, పీఆర్‌పీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల పరిస్థితులను ఎన్నికల్లో తమకనుకూలంగా మలచుకునే రాజకీయ పరిజ్ఞానం డీఎస్‌లో కనిపించింది. పైపెచ్చు.. జగన్ వర్గానికి చెక్ పెట్టాలనే ఆయన దీర్ఘదృష్టి దీనికి తోడైంది. అయితే, చిరంజీవి కాంగ్రెస్‌తో చెలిమి చేస్తే తమ పని అయిపోయినట్టేనని పసిగట్టిన జగన్ వర్గం ఆయనతో పొత్తును ససేమిరా అంది.
ఈ పరిణమాలతో ఖంగుతిన్న మెగాస్టార్ గ్రేటర్‌లో ఒంటరిగానే బరిలోకి దిగి తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు బాగనే ఉన్నా.. చిరుతో పొత్తుకు జగన్ శిబిరం అడ్డు చెప్పడానికి అనేక కారణాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీలో కూడా ఆ పార్టీ 17 శాతం ఓట్లను సాధించింది. వైఎస్ మరణం తర్వాత జరిగిన టెక్కలి ఉప ఎన్నికల్లో చిరంజీవి ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ, రెండు రకాలైన సానుభూతి పవనాల మధ్య కూడా పీఆర్‌పీకి పదిశాతం ఓట్లు పోలయ్యాయి.
సాధించిన సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా పీఆర్‌పీ పట్ల ప్రజల్లో, చిరంజీవి అభిమానుల్లో ఇప్పటికీ అభిమానం ఉంది. అయితే ఆయన రాజకీయ అపరిపక్వత వల్ల ఈ అభిమానాన్ని ఓట్లుగా మలచుకోలేక పోతున్నారన్నది జనమెరిగిన సత్యం. కొన్ని తొందరపాటు నిర్ణయాలు, నాయకత్వ లోపాలు పార్టీ పరిస్థితిని దిగజారుస్తున్నప్పటికీ సాధారణ ఓటర్లు మాత్రం వీటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. వారికి పార్టీ నాయకులతో సంబంధం లేదు. వారి దృష్టిలో చిరంజీవే తమ అధినేత అనే ధోరణి ఉంది.
భవిష్యత్‌లో కాంగ్రెస్, తెదేపాలకు చిరంజీవే గట్టి ప్రత్యామ్నాయం కాగలరు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌లోని డీఎస్, రోశయ్య వంటి
File
FILE
ఉద్ధండులు గుర్తించారు. ప్రరాపాతో పొత్తు ద్వారా తమకు ఛరిష్మాగల నాయకుడు లేని లోటును తీర్చుకునే ప్రయత్నం చేశారు. పీఆర్‌పీ శిబిరం ఈ పొత్తు కోసం అత్యుత్సాహం చూపి ఆదిలోనే తప్పటడుగు వేసిందని చెప్పొచ్చు. ఆపార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు పొత్తుపై తొందరపాటుతో చేసిన ప్రకటనలు చిరంజీవికి తలవొంపులు తెచ్చాయి.
రాష్ట్రంలో ఛరిష్మాగల నాయకుడైన చిరంజీవిని కాంగ్రెస్ తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం రేగింది. ఇది జగన్ వర్గం జీర్ణించుకోలేక పోయింది. ఆదిలోనే అడ్డుకోక పోతే తమకు భవిష్యత్‌లో పుట్టగతులుండవని భావించింది. ఫలితంగా అతి చిన్న విషయాన్ని తమ ధన, బల ప్రయోగంతో మీడియా ద్వారా లేనిపోని ప్రచారం చేయించింది. కాంగ్రెస్‌లో అంతర్గతంగాను, తెలుగుదేశంలో బహిర్గతంగాను అభద్రతాభావాలు ఉన్నయాన్నది అందరికీ తెలిసిందే.
భవిష్యత్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కాగల అవకాశాలు, దీనికితోడు జనాకర్షణ చిరంజీవిలో ఇప్పటికీ కొనసాగుతున్నందునే ఈ రెండు శిబిరాలు ఇంత ఘాటుగా స్పందించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు మాటెలా ఉన్నా ఈ పొత్తు ప్రయత్నాలతో చిరంజీవికి రాజకీయ వర్గాల్లో ఉన్న చరిష్మా మరోసారి వెల్లడైంది. ఇది రెండు పార్టీల అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ రాష్ట్రంలోని తెలుగుదేశం, వామపక్షాలు, భాజపా, ఇతర చిన్నాచితకా పార్టీలన్నీ దీనిపై ఘాటుగానే స్పందించాయి. ఇలాంటి పొత్తు కుదరడానికి వీల్లేదంటూ ప్రతిస్పందించాయి.
పొత్తుకు దిగిన కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలుండడం, జగన్ వర్గం పొత్తును తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. గతంలో కుదిరిన నీచాతి నీచమైన పొత్తులపై కూడా జరగని స్థాయిలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పొత్తు పొడుపుపై చర్చ, ప్రచారం సాగింది. ఇది చిరంజీవి పట్ల రాజకీయనేతల్లో ఉన్నటువంటి భయాందోళనను స్పష్టం చేస్తోందనే విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ప్రధానంగా జగన్ వర్గానికి మెగాభయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.