జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » షెడ్డుకు పరిమితం కానున్న కేసీఆర్ 'కారు'! (KCR | TRS | JAC | Congress | Telangana | Telugudesam)
Bookmark and Share Feedback Print
 
FILE
ప్రత్యేక తెలంగాణా కోసం "తలనైనా నరుక్కుంటా..." అంటూ ఉద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేసే కేసీఆర్‌, ఒకవేళ తెలంగాణా వస్తే... గిస్తే గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా కూచోవడమేనని చూచాయగా తెలిసిపోతోంది. తెలంగాణా ప్రాంతంలో జేఏసీ నుంచి కాంగ్రెస్ విడిపోయేందుకు సిద్ధమవడం దీనినే సూచిస్తోంది.

రాష్ట్రంలో శాంతి నెలకొన్న తర్వాత కాంగ్రెస్ హైకమాండ్, తెలంగాణా- సీమాంధ్ర నాయకులకు ఆమోదయోగ్యమైన ఫార్ములాను ఒకదానిని వారి ముందు ఉంచి రాష్ట్ర విభజన చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అంతకంటే ముందే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలమైన శక్తిగా, పాలనా పగ్గాలు చేపట్టేందుకు సమాయత్తమై ఉండటానికి కావలసిన చర్యలు తీసుకోవాలి కనుక మెల్లగా తెలంగాణా జేఏసీ నుంచి కాంగ్రెస్ పార్టీ జారుకునేందుకు యత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ అదే గనుక నిజమైతే... "తెలంగాణా రాష్ట్ర సాధనే నా ఊపిరి" అంటూ నినాదాలు ఇచ్చే కేసీఆర్ చేతులు ముందు పెట్టుక కూచునే పరిస్థితి ఎదురవవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ సైతం రెంటికీ చెడ్డ రేవడిగా మారనుంది. తెదేపా అధ్యక్షుడు అటు సమైక్య అనక.. ఇటు తెలంగాణా అని చెప్పక సమస్యను నానబెడుతుండటంతో ఇరు ప్రాంతాల ప్రజలలో ఆ పార్టీపై అనేక అపోహలు నెలకొని ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితిలో ఎక్కడో ఒకచోట తెదేపాకు ముక్కు బద్దలవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను సాధించుకునే "హీరో"గా నిలుచునే పరిస్థితి కనబడుతోంది. "తెలంగాణా ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమే" అంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు పల్లవి కూడా అందుకున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్‌కే నిండుసున్నా మిగిలేటట్లు కనబడుతోందని అంటున్నారు విశ్లేషకులు. అంటే... తెరాస కారును నిరవధింగా షెడ్డులోకి నెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్లు అనుకోవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.