జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » తెలంగాణకు "విదర్భ" తరహా ప్రత్యేక ప్యాకేజీ! (Telangana | Vidarbha | Package | Centre | State | Governer | Report)
Bookmark and Share Feedback Print
 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే అంశం భవిష్యత్‌లో శాశ్వతంగా తలెత్తకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతాన్ని ఇకపై అభివృద్ధిపథంలో నడిపించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.

ఇందుకోసం ప్రభుత్వంతో కాకుండా, గవర్నర్ ద్వారా ప్రత్యేక నివేదికను తెప్పించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులకు దర్పణం పట్టేలా ఈ నివేదిక ఉన్నట్టు వినికిడి.

ప్రస్తుతం తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనలను చల్లార్చడంతో పాటు ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా మహారాష్ట్రలోని విదర్భ అభివృద్ధికి ఇచ్చినట్లుగానే తెలంగాణా అభివృద్ధికి 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది.

ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఆందోళనల వల్ల కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇరకాటంలో పడిన విషయం తెల్సిందే. తెలంగాణా ప్రాంత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రానికి నివేదిక పంపినట్లు సమాచారం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నామని ఇటీవల జరిగిన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించక ముందే ఈ నివేదిక కేంద్రానికి చేరినట్టు తెలుస్తోంది.

అటు అభివృద్ధితో పాటు నీటి పంపకాల్లోనూ, ఉద్యోగ నియామకాల్లోనూ తెలంగాణాకు అన్యాయం జరిగిందని వస్తున్న విమర్శల నేపథ్యంలో తమకు తెలంగాణ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా కృషి చేయాలన్న తపన ఉందని చెప్పడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది.

ఇతే తరహా డిమాండ్ ఉత్పన్నమైనపుడు విదర్భ ప్రాంత అభివృద్ధికి కేంద్రం 15 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెల్సిందే. ఇదే తరహాలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది. ఈ అంశంపైనే తెలంగాణ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించడం అసాధ్యమని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్ల ఈ సమస్యకు పరిష్కార మార్గం కనుగొన్నట్టుగా చెప్పేలా ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీని తెరపైకి తీసుకుని రావాలని కాంగ్రెస్ కోర్ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.