జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » 'చిదంబర' రహస్యంతో ప్రకటన: ఖంగుతిన్న టీజేఏసీ (January 28 | Telangana JAC | Mass Resignation | Chidambaram)
Bookmark and Share Feedback Print
 
జనవరి 28వ తేదీన తెలంగాణ ప్రాంత నాయకులందరూ పార్టీలకతీతంగా మూకుమ్మడి రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని భావించిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వ్యూహాన్ని కేంద్రమంత్రి చిదంబరం తిప్పికొట్టారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేయనున్నట్టు గురువారం ఢిల్లీలో ఒక ప్రకటన చేసి జేఏసీని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశారు.

చిదంబరం ప్రకటనతో తెలంగాణా జేఏసీలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. దీనికి ప్రధాన కారణం... తమ మెడపై జేఏసీ పెట్టిన కత్తిని అతి చాకచక్యంగా కేంద్రం తప్పించిందని వారు సంబరపడి పోతున్నారు. జిత్తులుమారి చిదంబరం ప్రకటనలోని అసలు రహస్యం పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు సరైందని అంటున్నారు.

అదేసమయంలో చిదంబరం ప్రకటనపై జేఏసీలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ పేరుతో తెలంగాణా అంశాన్ని మరికొన్నేళ్లు కోల్డ్ స్టోరేజీలో పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నిందని దుయ్యబడుతోంది. విభజనపై స్పష్టమైన హామీతో పాటు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది.

నిర్ధిష్ట కాలపరిమితి లేకుండా కమిటీ ఏర్పాటు వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమని జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అంటున్నారు. ఇప్పటికే ఫజల్ ఆలీ, ప్రణబ్ ముఖర్జీ, రోశయ్య కమిటీలు ఉన్నాయని, వీటితో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు.

మరోవైపు చిదంబరం ప్రకటనతో ఖంగుతిన్న తెలంగాణా తెలుగుదేశం నేతలు అధినేత చంద్రబాబుతో హుటాహుటిన సమావేశమై సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్ వ్యూహరచనపై సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. మొత్తమ్మీద చూస్తే... తెలంగాణా ఏర్పాటు అంశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సైలెంట్ మోడ్‌లో ఉండాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్దేశించినట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితిలో తెలుగుదేశం కూడా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాన్నే అనుసరించే అవకాశం లేకపోలేదు. ఇక మిగిలింది... తెరాస, భాజపా. ఈ రెండు పార్టీలు తెలంగాణా సాధనలో ఎటువంటి అడుగులు వేస్తాయో చూడాలి మరి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.