రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల మధ్య, పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కుదిర్చేందుకు వీలుగా కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన కో-ఆర్డినేషన్ (సమన్వయ) కమిటీతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు హతాశులయ్యారు. ముఖ్యంగా, ఈ కమిటీలో తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన దివంగత వైఎస్సార్ వర్గీయులకు పెద్ద పీట వేయడం పట్ల వారు లోలోన ఆగ్రహంతో రగిలి పోతున్నారు.
జగన్‌తో పాటు.. వైఎస్ ప్రాణస్నేహితుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు, మరో సన్నిహితుడు, ఏలూరి ఎంపీ, సీమాంధ్ర ప్రతినిధి కావూరి సాంబశివరావుకు చోటు కల్పించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అదేసమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రి గీతారెడ్డిలకు మాత్రమే చోటు దక్కడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కమిటీలో సీమాంధ్ర నుంచి ముగ్గురు ఎంపీలకు చోటు కల్పించిన అధిష్టానం.. తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్క ఎంపీకి కూడా చోటు కల్పించక పోవడానికి కారణం ఏమై ఉంటుందని వారు లోలోన ప్రశ్నించుకుంటున్నారు.
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పుణ్యమాని కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయిన విషయం తెల్సిందే. చివరకు మంత్రివర్యులు కూడా కీలక సమావేశాల్లో ప్రాంతాలవారీగానే తమ వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు గాను కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఛైర్మన్‌గా కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీని, కో ఛైర్మన్‌గా పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌ను నియమించింది. కమిటీ సభ్యులుగా ముఖ్యమంత్రి రోశయ్య, మంత్రి గీతారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు జానా రెడ్డి, షబ్బీర్ ఆలీలకు చోటు కల్పించింది.
ఇందులో తెలంగాణ ప్రాంతం నుంచి ఇద్దరిని (డీస్ మినహా), సీమాంధ్ర నుంచి ముగ్గురిని (సీఎం కాకుండా), గ్రేటర్ హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి షబ్బీర్ ఆలీని అధిష్టానం ఎంపిక చేసి సమతుల్యం పాటించింది. అయితే, తెలంగాణ నుంచి నోటిమెతక నేతలను ఎంపిక చేయడం వెనుక ప్రాధాన్యత ఏమిటన్నది ఇపుడు అందరినీ తొలుస్తున్న ఏకైక ప్రశ్న.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్.దామోదర్ రెడ్డిని ఎంపిక చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సీమాంధ్ర ప్రాంతానికి వచ్చే సరికి ఆ ప్రాంత ప్రతినిధిగా కీలకంగా వ్యవహరించిన కావూరి సాంబశివరావుకు చోటు కల్పించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.
ప్రధానంగా, ఈ కమిటీని ఎందుకు వేశారో తెలంగాణ నేతలకు అంతుచిక్కడం లేదు. అధిష్టానం మాత్రం ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం కమిటీ వేసినట్టు చెపుతోంది. కానీ, తొలిసారిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న నేత అధ్యక్షతన "పార్టీ సమన్వయ కమిటీ"ని నియమించడంలోని మతలబు అర్థం కావడం లేదు. పార్టీ పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవడం, భవిష్యత్‌లో సొంత నేతల రణగొణ ధ్వనులు లేకుండా చేయడమే దీని లక్ష్యంగా భావిస్తున్నారు.
సమైక్య, ప్రత్యేక రాష్ట్ర వాదనలతో పార్టీలో నియంత్రణ కొరవడిందని, ఎవరికి వారు గీత దాటి మాట్లాడడాన్ని ఉపేక్షించరాదని అధిష్టానం భావిస్తోంది. పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య అంతరం ఏర్పడిందని గుర్తించిన అధిష్టానం భవిష్యత్‌లో పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండరాదనే ఏకైక లక్ష్యంతోనే ఈ చర్యకు ఉపక్రమించిందని రాజకీయ నిపుణుల అభిప్రాయంగా ఉంది.
అలాగే, వైఎస్ మరణం తర్వాత క్రమంగా ప్రాధాన్యం కోల్పోయిన ఆయన కుమారుడు జగన్‌కు మొట్ట మొదటిసారి పార్టీ పరంగా ఓ బాధ్యత అప్పగించడం ఇక్కడ చర్చించుకోవాల్సి ఉంటుంది. ఆయనతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర ఉన్న కేవీపీ కూడా సమైక్య వాదాన్ని బలపరుస్తున్నారు.
తద్వారా... గీత దాటిన వారిని నియంత్రించే బాధ్యతలు పరోక్షంగా వారికే అప్పగించింది. పార్టీలో తమకంటూ ఓ ప్రత్యేకత కలిగి.. నేతలు, కార్యకర్తలను ప్రభావితం చేయగలిగిన వారిని ఈ కమిటీలో నియమించడంలో ఆంతర్యం స్పష్టంగా అవగతమవుతోందని వారు అంటున్నారు.
అలాగే, ఒక్క కె.జానారెడ్డి తప్ప తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉన్న నేతలెవరినీ కమిటీలో నియమించకపోవడం గమనార్హం. కె.కేశవరావుతో సహా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలెవరినీ కమిటీలో నియమించకపోవడం, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు ఎంపీలు కేవీపీ, జగన్, కావూరీలకు స్థానం దక్కడాన్నే తెలంగాణ ప్రాంత నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ ఒక్క చర్యే తెలంగాణ అంశాన్ని నిర్వీర్యం చేసేలా ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు లోలోన వాపోతున్నారు. ఏది ఏమైనా... ఈ సమన్వయ కమిటీతో ఇరు ప్రాంతాల నేతలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.