రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. క్లిష్ట పరిస్థితుల్లో సీఎం పీఠాన్ని అధిరోహించిన కొణిజేటి రోశయ్య.. పాత మంత్రివర్గంతోనే ఇంతకాలం నెట్టుకొస్తున్నారు. ఎన్నో రకాలైన ఆటుపోట్లు ఎదురైనా.. విమర్శలు వెల్లువెత్తినా ఆయన ఎక్కడా తొణకలేదు.. బెణకలేదు. అధిష్టానం అప్పగించిన బాధ్యతలను ముదిమి వయస్సులోనూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
అయితే, బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనకు అనుకూలంగా ఉండే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన తహతహలాడారు. ఇందుకు అధిష్టానం అనుమతి ఇచ్చినా.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఏమాత్రం సహకరించలేదు. ఫలితంగా.. మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగువారి పండుగ శ్రీవికృతి నామ సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత రోశయ్యకు కాలం కలిసి వచ్చినట్టుగా ఉంది. రోశయ్యకు అన్నీ అనుకూలంగానే ఉంటాయని వేదపండితులు సెలవిచ్చారు.
అందుకే మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ఇందుకు ఏప్రిల్ నాలుగో తేదీని ముహుర్తంగా ఖరారు చేశారు. ఆ రోజు శుభదినం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరుగనున్నాయి. అందువల్ల ఆ రోజున ఓ మంచి పని చేద్దామంటూ రోశయ్య బుధవారం అన్నారు. ఈ వ్యాఖ్యలు మంత్రివర్గ విస్తరణను ఉద్దేశించి చేసినవేనని ఆయన సహచరులు, సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గం కూర్పు ఎలా ఉండబోతుందన్న అంశంపై ఇప్పటి నుంచే ఆసక్తికరమైన చర్చ కాంగ్రెస్ సభ్యుల్లో ప్రారంభమైంది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో తనకేమాత్రం సహకరించని వారిని ఓ కంట కనిపెట్టాలని భావిస్తున్నట్టుగా ఉంది. ముఖ్యంగా, యువకులకు కీలకమైన శాఖలు కేటాయించడం ఆయనకు సుతరామా ఇష్టం లేదు. పైపెచ్చు.. ఒకరివద్దే రెండు మూడు శాఖలు ఉన్నాయి. వీటిని వేరు చేసి కొత్తవారికి కేటాయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అదేసమయంలో తనకు అనుకూలంగా, చేదోడు వాదోడుగా ఉండే వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రోశయ్య అనుకుంటున్నట్టు వినికిడి. తన మాట వినని వారిపై అధిష్టానం ఆమోదంతో వేటు వేసేందుకు ఆయన సాహసం చేసే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబులపై వేటు పడే అవకాశం ఉన్నట్టు సీఎం సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.
అదేసమయంలో వైఎస్ హయాంలో చిన్నచూపుకు గురైన సీనియర్ నేతలైన జేసీ.దివాకర్ రెడ్డి, డీఎల్.రవీంధ్రా రెడ్డి, కె.జానారెడ్డి, శంకర్ రావు, మర్రి శశిధర్ రెడ్డి తదితరులకు చోటు కల్పించే వీలుంది. వీరంతా ఇప్పటికే రోశయ్య చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే మంత్రివర్గం కూర్పు సామాజిక సమతుల్యతను ప్రతిబింభించేలా ఉండనుంది. అన్ని వర్గాలకు, కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తూనే తెలంగాణ ప్రాంతానికి పెద్దపీట వేయవచ్చని రోశయ్య సన్నిహితులు చెపుతున్నారు.