ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » అధిష్టానం వద్ద హై ఫై నేతల హడావుడి.. పీసీసీ పదవికి గాలం! (PCC | Congress | DS | YS | Kesava Rao | KK | VH | Rosaiah | Regional)
అధిష్టానం వద్ద హై ఫై నేతల హడావుడి.. పీసీసీ పదవికి గాలం!
రాష్ట్రంలో తాజాగా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. దేశంలోనే కాంగ్రెస్‌కు అత్యంత బలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. ఇక్కడే ఆ పార్టీ రూపురేఖలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడినట్టు ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా ప్రజానేత వైఎస్ హఠాన్మరణం తర్వాత పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఐదు సంవత్సరాలపాటు వైఎస్‌ను కేంద్రంగా చేసుకుని పరిభ్రమించిన రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు.. ఇపుడు చుక్కాని లేని నావలా ప్రయాణిస్తున్నాయి. ఇది అధిష్టానాన్ని బాగా వేధిస్తోంది.
ప్రధానంగా వైఎస్ జీవించి ఉన్నంత కాలం రాజకీయ అస్త్రసన్యాసం చేసిన నాయకులు ఒక్క సారిగా తెరపైకి వచ్చారు. వైఎస్ జగన్‌కు అడుగడుగున అడ్డుపడుతున్నారు. వైఎస్ కుటుంబాన్ని తూర్పారబడుతున్నారు. తామే అధిష్టానమన్న రీతిలో హల్‌చల్ చేస్తున్నారు. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీను ముందుండి నడిపించగల దమ్మూధైర్యం ఉన్న నేత ఒక్క జగన్ తప్ప రాష్ట్ర కాంగ్రెస్‌లో భూతద్దం వేసి గాలించినా మరే నాయకుడూ కనిపించడం లేదు.
అదలా ఉంచితే... గతంలో వైఎస్, డీఎస్‌ల జోడీ ఫలవంతమైందిగా ముద్రపడింది. వైఎస్ ఉన్నంతకాలం ఆ పదవిలో ఉంటూ ఇతర పార్టీల నాయకులకు వల వేయడంలో డీఎస్ కూడా కీలక పాత్ర పోషించారు. అయితే వైఎస్ మరణం తరువాత నేరుగా అధిష్టానంతో సంబంధాలు నెరిపే వారి సంఖ్య అధికమైంది. ఇలాంటి పరిస్థితులలో పీసీసీ అధ్యక్షుడుగా డీఎస్ పలుచన అయ్యారు. అలాగే.. అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జనానికి దూరంగా హై..ఫై రాజకీయాలు చేసే నాయకుల హవా పెరుగుతోంది.
అయితే ఈ పరిస్థితులలోఅధిష్టానం ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేసే పరిస్థితులలో లేదు. ఇదే అదనుగా భావించిన హై...ఫై.... నేతలు పీసీసీ పదవికి వల వేస్తున్నారు. ఇలాంటి వారి జాబితాలో కే.కేశవరావు ముందు వరుసలో ఉన్నారు. ఈయనతో పాటు వెంకటస్వామి, వి.హనుమంతరావు ఉన్నారు. అయితే వైఎస్‌ది చాలా బలమైన వర్గం అనే విషయం అధిష్టానానికి స్పష్టంగా తెలుసు. ఒక బలమైన వర్గం బలహీన పడితే పార్టీకి కూడా పెద్ద నష్టం వాటిల్లినట్లే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
పైగా ఒకవైపు సానుభూతి, మరోవైపు జగన్‌కున్న జనాకర్షణ ఉన్న యువనాయకుడుని కాదని పీసీసీ వీరికి ఇస్తే ఎలా? అనే అంశంపై అధిష్టానం చాలా సీరియస్‌గా ఆలోచిస్తోంది. హై...ఫై.... నాయకులకు ఇస్తే తమతో లాయల్‌గా ఉంటారు. కాని రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమవుతుందోననే బెంగ కూడా ఉంది. పైగా ఈ పర్యాయం రాష్ట్రంలో యువ ఎమ్మెల్యేలు, నాయకులు చాలామంది తెరపై కనిపిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులలో అనుభవం ఉన్న రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు పీసీసీ యువరక్తానికి కేటాయిస్తే బాగుంటుందని వాదనలు అధిష్టానికి చేరాయి. అదేసమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పీసీసీ పదవిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడిందనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఈ నేపధ్యంలో ఆ పదవిని అధిష్టానం ఎవరికి కట్టబెడుతుందోనన్న ఆసక్తి నెలకొని ఉంది..!!