కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు మరో సమస్య లేవనెత్తారు. తమకంటూ ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావాలంటూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇంకేమాత్రం.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)లో కొనసాగలేమని తేల్చి చెప్పనున్నారు. అందువల్ల తెలంగాణ ప్రాంత సమన్వయ కమిటీ స్థానంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీఆర్‌సిసి)ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తూ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
ఈ డిమాండ్ అధిష్టానానికి ఏమాత్రం రుచించడం లేదు. ఇప్పటికే పలు సమస్యలతో తలలు పగులకొట్టుకునే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు, నేతలు చేసిన సరికొత్త డిమాండ్ అధిష్టానం గొంతులో పచ్చివెలక్కాయ పడిన చందంగా మారింది.
పైపెచ్చు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో సంస్థాగతంగా అయోమయం నెలకొనివుంది. ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఎన్నికైన తర్వాత ఆయా రాష్ట్రాల పీసీసీలు రద్దవుతాయి. అయినప్పటికీ.. ఏఐసీసీ కార్యవర్గాన్ని అధికారికంగా నియమించే వరకు ఈ పీసీసీలు తాత్కాలిక హోదాలో పని చేస్తుంటాయి. ఈ వెసులుబాటునే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.
తాత్కాలిక పీసీసీ చీఫ్‌గా ఉన్న డీఎస్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. దీంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలతో పాటు.. సొంత ప్రాంత నేతలను కట్టడి చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీని ధిక్కరించే వారిపై కొరఢా ఝుళిపించలేని పరిస్థితిలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తమకూ ఓ పీసీసీ కావాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ ఎంపీలు, నేతలు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. గత ఏడాది డిసెంబరు 31వ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయానని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)లో తాము కొనసాగలేమని వారు కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో పీసీసీ పీఠాన్ని సీమాంధ్రకు అప్పగిస్తే తెలంగాణ నేతలను, తెలంగాణ నేతలకు ఇస్తే సీమాంధ్ర నేతలను చక్కదిద్దలేని పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్‌లో నెలకొంది. వీటన్నింటినీ బేరీజు వేసుకుని అధిష్టానమే ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలని తెలంగాణ ప్రాంత నేతలు కోరుకుంటున్నారు.
ప్రధానంగా తమకంటూ పీసీసీని ఇవ్వాలని వారు చేస్తున్న వాదనతో పార్టీలో ఒక్కసారి కుదుపు మొదలైంది. ఇప్పటికే పలు సమస్యలతో తలలు పట్టుకుని అల్లాడుతున్న కాంగ్రెస్ పెద్దలకు మరో సమస్యకు పరిష్కారమార్గం కనుగొనాల్సిన పరిస్థితి ఎదురుకానుంది.