ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » కాంగ్రెస్‌లో చెలరేగిన కులాల పోరు : కిరణ్ సర్కారుకు తలనొప్పులు!! (Congress | Chiranjeevi | Kiran Kumar Reddy | Minister Posts)
కాంగ్రెస్‌లో చెలరేగిన కులాల పోరు : కిరణ్ సర్కారుకు తలనొప్పులు!!
సోమవారం, 23 జనవరి 2012( 17:13 IST )
File
FILE
జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖలో కులాల పోరాటం ఉధృతమైంది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరు కాపు వర్గానికి చెందిన నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ఈ కులాల పోరుకు ఆజ్యం పోసినట్టయింది. దీనికితోడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బలమైన కాపు నేత బొత్స సత్యనారాయణ, మరో కాపు నేత, సినీనటుడు చిరంజీవిలు చెలాయిస్తున్న ఆధిపత్యం కూడా దీనికి తోడైంది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుకు లేనిపోని తలనొప్పులు వచ్చిపడ్డాయి.
ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తున్న కులాల్లో రెడ్డి వర్గానిదే పైచేయిగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డ మంత్రివర్గానికి వచ్చేసరికి ఈ లెక్క తప్పింది. ఇక్కడ రెడ్డి వర్గానికంటే కాపు వర్గానికి పెద్ద పీట వేయాల్సి వచ్చింది. దీంతో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాపు సామాజికవర్గానికి తొమ్మిదిని మంత్రులుగా నియమించాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. ఇది రెడ్డి సామాజికవర్గానికి ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది.
ఇదిలావుండగా.. దళిత వర్గానికి చెందిన మంత్రి పి.శంకర్రావును క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా చాలా వివాదాస్పదమైంది. శంకర్రావు బర్తరఫ్ దళిత వర్గాల్లో ముఖ్యంగా మాదిగ సమాజికవర్గం నేతలు ఆగ్రహానికి గురి చేసింది. దీనికి తోడు శంకర్రావు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి కావడంతో ఆయన స్థానంలో కొత్త వారికి మంత్రి పదవి ఛాన్స్ కల్పించాలని ఆ ప్రాంతానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇంకోవైపు.. రెడ్డి వర్గానికి బీసీలోని కాపు మినహా ఇతర కులాల నేతలు, మాల సామాజికవర్గం నాయకులు కూడా ముఖ్యమంత్రిపై ఫైర్ అవుతున్నారు. మంత్రివర్గంలో కాపు వర్గానికి పెద్ద పీట వేయడం సరైంది కాదని వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రరాపాకు చెందిన వారికి మాత్రమే చోటు కల్పించి, మంత్రి శంకర్రావు తొలగింపుతో సొంత పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు కాస్తా కాంగ్రెస్‌లో సం"కుల సమరం"గా మారింది.
కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేసిన చిరంజీవికి, ఆయన సామాజికవర్గానికి పెద్దపీట వేయడం సరైంది కాదని, ఇలా చేయడం వల్ల ఇతర వర్గాల పట్ల కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి, అమలాపురం ఎంపీ హర్షకుమార్‌లు అభిప్రాయపడుతున్నారు. అలాగే, కేబినెట్‌లో తెలంగాణకు సంబంధించి ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయకపోవడంతో ఆ ప్రాంత నేతలు మండిపోతున్నారు.
మరోవైపు... రాష్ట్ర వ్యాప్తంగా 24 స్థానాల్లో ఉప ఎన్నికలూ రానున్న నేపథ్యంలో పార్టీలో నెలకొన్న సంక్షోభం, నేతల మధ్య వివాదాలు ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తాయోనని పార్టీలో ముమ్మరంగానే చర్చ జరుగుతోంది. మున్ముందు సహకార ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలూ ఎదురుకానున్నాయి. ఇవిచాలదన్నట్టూ.. కిరణ్-బొత్సల మధ్య ఆధిపత్య పోరు అంతర్గతంగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పార్టీనేతల మధ్య సమన్వయాన్ని సాధించలేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుకు తలనొప్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.