ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » కొల్లాపూర్ అసెంబ్లీ పోరు : మంత్రి డీకే అరుణ వర్సెస్ జూపల్లి!! (Kollapur | Assembly by Poll | dk Aruna | Congress | trs)
కొల్లాపూర్ అసెంబ్లీ పోరు : మంత్రి డీకే అరుణ వర్సెస్ జూపల్లి!!
బుధవారం, 25 జనవరి 2012( 18:03 IST )
File
FILE
మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచార వేడి రాజుకుంది. ఈ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు... తెలంగాణ రాష్ట్ర సాధన కోసమంటూ తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితుల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి తిరిగి గెలుపొందేందుకు జూపల్లి కృష్ణారావు శతివిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. దీంతో విజయంపై కాస్త ధీమాతో ఉన్నప్పటికీ... ఈ జిల్లా మంత్రిగా ఉన్న డీకే.అరుణకు వ్యక్తిగతంగా మంచి పలుకుబడి, ఆదరణ ఉండటంతో పాటు.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో జూపల్లి గెలుపు కోసం శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇందుకోసం ఆయన ఇప్పటి నుంచే ప్రచారాన్ని ఆరంభించారు. అలాగే, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ప్రచారాన్ని ఉధృతం చేసింది. మరోవైపు.. కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీనే ఆదరించాలని కాంగ్రెస్ నేత మావిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, మంత్రి డీకే.అరుణలు గ్రామస్థాయి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
అయితే, నియోజవర్గంలో తెలంగాణవాదం బలంగా ఉందని నిరూపించేందుకు ఈనెల ఐదో తేదీన జూపల్లి నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఇందులో మెదక్ ఎంపీ విజయశాంతి, తెలంగాణ ఐకాస జేఏసీ కన్వీనర్ కోదండరామ్, ప్రజాగాయకుడు దేశపతి శ్రీనివాస్‌లు హాజరై సభను విజయవంతం చేశారు. ఇది తెరాస శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
అలాగే, కాంగ్రెస్ నేత మావిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి రచ్చబండ పేరుతో జిల్లా మంత్రి డీకే.అరుణతో కొల్లాపూర్‌లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి పార్టీ వీడని కాంగ్రెస్ నాయకులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే జిల్లా ప్రభుత్వ అధికారుల సమీక్ష సమావేశం కొల్లాపూర్‌లో నిర్వహించి మంత్రి డీకే అరుణ పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేయించారు.
మరోపైపు... తెలుగుదేశం పార్టీ నేత సీఆర్.జగదీశ్వర్‌రావు మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ను తాలుకా తెదేపా స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి రప్పించి ఎన్నికల సమరానికి సిగ్నల్ ఇప్పించారు. ఇప్పటికే జూపల్లి కృష్ణారావు, సీఆర్ జగదీశ్వర్ రావుకు టికెట్లు ఖరారు కావడంతో కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిని అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ.. విష్ణువర్ధన్ రెడ్డే బరిలో నిలువవచ్చని తేలడంతో జూపల్లి విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. పైపెచ్చు.. ఈ ఉప ఎన్నికను మంత్రి డీకే అరుణ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఉప సమరం జూపల్లి వర్సెస్ డీకే అరుణకు జరుగుతున్నట్టుగా ఉంది.