అంబేద్కర్‌కు ముందు.. వారు తరతరాల పాటు బానిసత్వంలో మగ్గారు.. పంచములనే కించనకు లోనయ్యారు, ఒంట్లో ఒకే రక్తం ప్రవహిస్తున్నా అదేమి పట్టనట్లుగా తమను తాము అగ్రకులాలనే భుజకీర్తులు తగిలించుకున్న వారి పెత్తనాన్ని వేల సంవత్సరాల పాటు మౌనంగా భరించారు... వారి గాలి సోకితే ఎక్కడ మైల పడిపోతామోనంటూ ఊరికి దూరంగా పెట్టినా.. వారు నడిచిన మార్గంలో పడిన పాద ముద్రలను చూసినా సరే ఎక్కడ పాపం చుట్టుకుంటుందోననుకుంటూ వారి వీపుల వెనక మొలలకు తాటాకులు కట్టి, వారి అడుగుజాడలను చెరిపేసినా ఇదంతా తమ ప్రారబ్దం అనుకున్నారు కానీ ఎవరిపైనా తిరగబడలేదు.
అంబేద్కర్ తర్వాత... ఆత్మగౌరవం వారి సొంతం.. ఆత్మాభిమానం వారి ఆయుధం... సమాజంలో విద్యాధికుల్లో, ప్రభుత్వ ఉద్యోగాలూ వృత్తుల్లో వారు కీలక స్థానాలను అలంకరించారు. నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకోవాలని ప్రయత్నించి అగ్రవర్ణాల వారి ఆగ్రహానికి గురయి నాలుకలపై వాతలు పెట్టించుకున్న ఒకనాటి అభాగ్యుల వారసుల్లో ఇప్పుడు ఐఎఎస్‌లున్నారూ, ఐపీఎస్‌లూ ఉన్నారు. రాజకీయాల్లో చేరి దేశ భవితను దిద్దడంలోనూ అందరికీ దీటుగా ఉన్నారు.
ఈ వర్ణన దళితుల గురించి.. గాంధీ మహాత్మునితో హరిజనులని పిలిపించుకున్న పుణ్యాత్ముల గురించి.. ఒకనాటి వారి దురవస్థ గురించి. ఇప్పుడు వారి పరిస్థితులు మారాయి.. స్థితిగతుల్లో అనూహ్య పరిణామాలు సంభవించాయి. దీనంతటి వెనక ఉన్నది ఒకే ఒక్కడు.. ఆయన నిజంగానే మిలియన్లలో ఒక్కడు. భారతీయతకు చెరగని మచ్చగా మారి.. తీరని జబ్బుగా పరిణమించిన కులతత్వానికి, పంచవర్ణ వ్యవస్థకు చరమగీతం పాడేందుకు అలుపెరగని పోరు సలిపిన మేధావి డా. బి.ఆర్. అంబేద్కర్. ఆయన పుణ్యమా అంటూ రిజర్వేషన్ల ఫలాలను ఒక్క దళితులే కాదు, బహుజనులని పిలుచుకుంటున్న వేలాది కులాలకు చెందిన వారు స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నారు.
అలాంటి మహానుభావుడికిప్పుడు అవమానాలు ఎదురవుతుండటం చూసి జాతీయవాదుల గుండెలవిసిపోతున్నాయి. కుల వివక్షతకు తావు లేని, ఒక విధంగా చెప్పాలంటే కులవ్యవస్థ ఊసే లేని అసలుసిసలయిన భారత జాతి నిర్మాణానికి కంకణం కట్టుకుని పోరాడిన వ్యక్తి విగ్రహాలను పనిగట్టుకుని ధ్వంసం చేయడం ఏ రకమయిన సంస్కృతికి నిదర్శనమని వారు ప్రశ్నిస్తున్నారు. దేశ నిర్మాత చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించకపోయినా వీధుల్లో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ధ్వంసం చేయడాన్ని వారు సహించలేకపోతున్నారు.
రిజర్వేషన్లు ఇంకా అవసరమా...? స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అవుతున్నా కోనసీమలో ఇప్పటికీ రెండు గ్లాసుల విధానం అక్కడక్కాడా కొనసాగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉన్నాయి. తమను మించిపోయి అగ్రస్థానాలకు ఎగబాకుతున్నారనే అక్కసుతోనే కొందరు ఇలా విగ్రహాలను ధ్వంసం చేసి తమ అక్కసును తీర్చుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాయలసీమ, తెలంగాణల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని హోటళ్లలోకి దళితులు ధైర్యంగా వెళ్లగలిగే పరిస్థితులు లేవు.
అంబేద్కర్ ఆనాడు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో కులాలకు కొమ్ము కాసే అగ్రకులాల వారి నుండి ఎన్నో ఆటంకాలెదురయ్యాయి. అయితే, ఆ సమయంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి సహాయ సహకారాలను అందించిన వారు కూడా అగ్రకుల మేధావులేనన్న విషయాన్ని మరువరాదు. రిజర్వేషన్ల పేరుతో తమను ఉన్నత విద్య నుండి దూరం చేస్తున్నారనే బాధను చాలామంది ఓసీ విద్యార్థులు వ్యక్తం చేస్తున్నా, వాస్తవానికి రిజర్వేషన్ల రూపేణా దళితులకు దక్కుతోంది చాలావరకు తక్కువేనని నిపుణులంటున్నారు.
రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ తన రిజర్వేషన్ల విధానం ద్వారా దళితులకు ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని మాత్రమే కల్పించారు. అంటరానితనాన్ని నిషేధించారు. రాజ్యాంగం ప్రకారం కులం పేరుతో దూషించడం, మైలపడిపోయానని అవమానించడం నేరం. దానికి శిక్ష తీవ్రంగా ఉంటుంది. తరతరాలుగా రక్తంలో కుల వివక్ష జీర్ణించుకుపోయిన దేశంలో పైన పేర్కొన్న రాజ్యాంగబద్ధమయిన రక్షణలు, కఠిన చర్యలకు బయపడి అయినా దళితులను వారి మానాన వారిని బతికేలా చేయడానికి ఆయన కృషి చేసారు. అర్థ దశాబ్దానికి పైగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున ఇకపై వాటిని రద్దు చేసేసి అందరినీ సమానంగా చూడాలని రిజర్వేషన్ల వ్యతిరేకులంటున్నారు.
ఈ వాదనతో రాజ్యాంగ నిపుణులు విబేధిస్తున్నారు. దళితులకు గడిచిన 60 ఏళ్ల నుండే రిజర్వేషన్ల లాంటి రక్షణలు లభించాయి. వాటిని దళితులు ఇంకా పూర్తిగా అనుభవించనేలేదనే వాదనలున్నాయి. రిజర్వేషన్ల ఫలాలు దళితుల్లో కేవలం కొందరికి మాత్రమే దక్కుతున్నాయనీ, చాలామంది ఇప్పటికీ విద్యకు దూరంగానే ఉండిపోయారనే వ్యాఖ్యలు బలంగానే వినిపిస్తుంటాయి.
ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న తోటి భారతీయ సహోదరుల గోడును పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా? మనుస్మృతి పేరుతో వేల సంవత్సరాల పాటు వివక్షను మౌనంగా అనుభవించిన దీనులు ఈ 65 ఏళ్లలోనే కొద్దో గొప్పో ఊపిరి పీల్చుకోగలుగుతున్నారంటే అందుకు కారణం అంబేద్కర్.
అటువంటి నేత.. రాజ్యాంగ నిర్మాత కూడా అయిన ఆ మహనీయుని ఆకృతులను విచ్ఛిన్నం చేయడమేనా ఆయనకిచ్చే గౌరవం..?! ఈ కుల రక్కసి శక్తులను పారదోలేదేన్నడు..?!! ఎప్పుడు..?!!!