ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » ఉప ఎన్నికలు : నాగం ఓటమే లక్ష్యంగా తెదేపా వ్యూహం! (By Poll | Nagam Janardhan Reddy | trs | Naagar Karnol | jc Brothers)
ఉప ఎన్నికలు : నాగం ఓటమే లక్ష్యంగా తెదేపా వ్యూహం!
శనివారం, 28 జనవరి 2012( 12:39 IST )
File
FILE
తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల సమయం సమీపిస్తోంది. దీంతో ఈ ఎన్నికలు జరిగే స్థానాల్లో రాజకీయాలు మెల్లగా వేడెక్కుతున్నాయి. తెలంగాణ కోసం తమ పదవులను త్యజించిన నేతలు తిరిగి పోటీ చేసి గెలుపొందేందుకు తమ వంతు పయత్నాలు మొదలెట్టారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి, తెలుగుదేశం మాజీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఒకరు. ఈయన నాగర్ కర్నూల్ స్థానం నుంచి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
తెదేపాకు రాజీనామా చేసిన ఆయన.. ఏ రాజకీయ పార్టీలో చేరకుండా తెలంగాణ నగరా సమితిని స్థాపించి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో... ఆయన ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమై ఉప ఎన్నికల అంశంపై చర్చించారు. నాగర్ కర్నూల్ నుంచి స్వతంత్రంగా పోటీకి దిగితే తనపై తెరాస తరపున అభ్యర్థిని బరిలోకి దించొద్దని ఆయన విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. స్వతంత్రంగా పోటీ చేయడం కంటే తెరాస అభ్యర్థిగానే బరిలోకి దిగాలని సూచించినట్టు తెరాస శ్రేణుల సమాచారంగా ఉంది.
ఈ నేపథ్యంలో... పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పార్టీని, పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న నాగంను ఉప ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నందుకు నాగం జనార్ధన్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడక లాంటిదేనని భావించినప్పటికీ... తెదేపా అనుసరిస్తున్న వ్యూహాత్మక రాజకీయాల వల్ల నాగంకు చిక్కులు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.
ఇందులోభాగంగా... సరిగ్గా జనార్ధన్ రెడ్డి పేరు కలిగిన ప్రముఖ వస్త్ర వ్యాపారి జేసీ బ్రదర్స్ యజమాని మర్రి జనార్ధన్ రెడ్డిని రంగంలోకి దించాలని తెదేపా అధినాయకత్వం నిర్ణయించి, ఈ మేరకు జనార్ధన్ రెడ్డికి సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆయన కూడా అదే నియోజకవర్గానికి చెందినవారు కావడం, ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఒక్కసారిగా అక్కడ పోటీ రసవత్తరంగా మారింది.
అంతేకాక మరి కొందరు జనార్ధన్ రెడ్డి పేరు కలిగిన వారిని స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయించవ్చని చెబుతున్నారు. అయితే, నాగం జనార్ధన్ రెడ్డి తెరాసతో పొత్తుపెట్టుకుని కారు గుర్తుపై పోటీచేస్తే అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుందని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ తెరాసలోకి వెళ్లడం నాగంకు ఇష్టం లేదని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.
ఇలాంటి సమయంలో నాగం కనుక స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తే ఆయనకు తన ఎన్నికల గుర్తును ప్రచారం చేసుకోవడానికే సమయం సరిపోదన్నది తెదేపా వర్గాల అంచనాగా ఉంది. అంతేకాక జనార్ధన్ రెడ్డి పేరుతో పలువురు నామినేషన్ వేస్తే అది మరింత సమస్యగా మారి నాగం గెలుపు కష్టతరంగా మారుతుందన్నది తెదేపా నేతలు జోస్యం చెపుతున్నారు.