జనవరి 12 నుంచి 15 వరకు ప్రధాని మన్మోహన్ సింగ్ బీజింగ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఇరుదేశాలకు సంబంధించిన ఐదు ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు కేంద్రమంత్రివర్గ సమావేశం గురువారం ఆమోదం తెలిపింది. రైల్వేలు, గృహనిర్మాణ రంగం మరియు సంప్రదాయ ఔషధాలు తదితర అంశాలపై భారత్-చైనా దేశాల మధ్య పరస్పర సహకారానికి ఒప్పందాలు ఊతమిస్తాయి.
అదేసమయంలో భూగర్భశాస్త్రం, భూ వనరుల నిర్వహణ, భూమి పాలన, పునరావాసం తదితర క్షేత్రాలకై ఇరువర్గాల మధ్య సహకారానికై ఒక పరస్పర అవగాహన ఒప్పందానికి కుదుర్చుకునేందుకు సైతం మంత్రి వర్గ సమావేశం ఆమోదించింది.
ప్రధాని పర్యటన సందర్భంగా పైన పేర్కొన్న ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తారు. ఇక రైల్వే రంగాన్ని పరిశీలించినట్లయితే మూడు సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అయ్యే పరస్పర అవగాహన ఒప్పందం, ఇరు దేశాల రైల్వే రంగాల మధ్య సహకారానికి తోడ్పడుతుంది.
|