వ్యక్తిగత కారణాల వల్ల తన బాధ్యతల నుంచి అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి నికోలస్ బర్న్స్ తప్పుకోనున్నారని ఆ శాఖ మంత్రి కండోలినా రైజ్ వెల్లడించారు. అలాగే.. ఆయన స్థానంలో రష్యాలో అమెరికా రాయబారిగా విధులు నిర్వహిస్తున్న విలియమ్స్ బర్న్స్‌ను నియమించనున్నట్టు ఆమె తెలిపారు. భారత్- అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకోవడం బర్న్స్ కీలక పాత్ర పోషించారు. పలు దఫాలుగా భారత్‌తో చర్చలు జరిపారు. అలాగే భారత్, ఇరాన్ దేశాలకు సంబంధించిన అమెరికా విధి విధానాలను రూపకల్పన చేయడంలో నికోలస్ చురుకుగా వ్యవహరించారు.
అంతర్జాతీయ సమాజాన్ని కాదని అణు కార్యక్రమం చేపట్టిన ఇరాన్‌పై అన్ని రకాల ఆంక్షలు విధించేలా చేయడంలోనూ బర్న్స్ పైచేయి సాధించారు. నాటోలో అమెరికా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. బర్న్స్ గతంలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు ప్రత్యేక సహాయకునిగా వున్నారు. అంతేకాకుండా.. అగ్రదేశానికి చెందిన అగ్రశ్రేణి దౌత్యవేత్తల్లో ఆయనది మూడో స్థానం. ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల్లో అమెరికా దౌత్యవేత్తగా వ్యవహరించారు. బర్న్స్ అమెరికాకు చెందిన ఎనిమిది విశ్వవిద్యాల నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాలను స్వీకరించారు.
|