పాకిస్థాన్ మాజీ ప్రధాని దివంగత బెనజీర్ భుట్టో జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో ఒక చిత్రం నిర్మితంకానున్నట్టు వచ్చిన వార్తలను ఆమె భర్త, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) కో-ఛైర్మన్ అసిఫ్ అలీ జర్ధారీ తోసిపుచ్చారు. తనకు ఆలాంటి ఆలోచనే లేదని, ఈ విషయంపై తనను ఎవరూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం ఇస్లామాబాద్‌లో వెల్లడించారు. బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ తాజాగా నిర్మించే ఈ చిత్రంలో ప్రముఖ నటీమణి షబానా అజ్మీ భుట్టో పాత్రలో నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా భుట్టో జీవితంపై విడుదలై హాట్‌కేకుల్లా అమ్ముడు పోయిన "డాటర్ ఆఫ్ ది ఈస్ట్" అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం నిర్మితంకానున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ చిత్ర కథకు అవసరమైన పుస్తకాన్ని ఉపయోగించేకునేందుకు పుస్తక రచయిత నహీద్ అంగీకారం తెలుపవలసి ఉంటుందని మహేష్ భట్ ప్రకటించారు. ఈ తరుణంలో బెనజీర్ జీవితంపై చిత్రాన్ని నిర్మించే విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని జర్దారీ చెప్పడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది.
|