నేపాల్ రాజ్యంగ సభకు జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన మావోయిస్టులు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. సంకీర్ణ ప్రభుత్వ రథసారథిగా ఆ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన బాబూరాం భట్టారాయ్ ఎన్నిక కానున్నారు. ఇదే విషయంపై మావోయస్టు చీఫ్ ప్రచండ, ప్రస్తుత ప్రధాని గిరిజా ప్రసాద్ కోయిరాలోతో సమావేశమై చర్చలు జరిపారు.
నేపాల్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు, మిగిలిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రచండ ప్రకటించారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి కొయిరాలాను కలిశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన విధివిధానాల ఖరారుపై చర్చించారు. 240 స్థానాలకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మావోయిస్టులు దాదాపు 110 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించారు.
అలాగే దశాబ్దాల చరిత్ర కలిగిన నేపాలీ కాంగ్రెస్ కేవలం 33 సీట్లతోను, సీపీఎన్-యూఎంఎల్ 29 సీట్లతోను సరిపుచ్చుకున్నాయి. మధేశీ పీపుల్స్ రైట్స్ ఫోరంకు 18 సీట్లు, తెరై మధేశీ డెమొక్రాటిక్ పార్టీకి ఐదు సీట్లు దక్కగా, మరో ఐదు సీట్లను చిన్నాచితక పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు.
|