ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటు పాకిస్థాన్‌లో జైలుశిక్ష అనుభవిస్తున్న భారత ఖైదీ సరబ్‌జిత్ సింగ్ ఉరిశిక్షను పాకిస్థాన్ ప్రభుత్వం శుక్రవారం వాయిదా వేసింది. ఈ శిక్ష అమలును కొద్ది రోజుల పాటు మాత్రమే వాయిదా వేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా సరబ్‌జిత్‌ను ఆయన కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
గతంలో పాకిస్థాన్‌లో జరిగిన బాంబు పేలుళ్ళతో సరబ్‌జిత్ సింగ్‌కు సంబంధం ఉన్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రధాన ఆరోపణ. దీంతో కొన్నేళ్లుగా పాక్ జైలుగోడల్లో మగ్గుతున్న సరబ్‌కు గత నెలలో ఉరిశిక్షను అమలు చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే భారత్ అంతర్జాతీయ సమాజం మూలంగా పాక్‌పై ఒత్తిడి తెచ్చి ఉరిశిక్షను వాయిదా వేయించింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరికొన్ని రోజుల పాటు ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్‌లోని పిపిపి-పీఎంఎల్ (ఎన్) సంకీర్ణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ సరబ్‌జిత్ గతంలో దాఖలు చేసుకున్న పిటీషన్‌ను ఆ దేశ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తోసిపుచ్చిన విషయం తెల్సిందే.
|