ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ధరల వల్ల ప్రభుత్వాలకు ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ హెచ్చరించింది. దీనివల్ల కొన్ని దేశాల మధ్య యుద్ధాలు సైతం జరిగే ప్రమాదం ఉందని ఆ సంస్థ అధిపతి డొమినిక్ స్ట్రాస్ ఖాన్ హెచ్చరించారు. ఫ్రాన్స్‌కు చెందిన ఐరోపా-1 రేడియోకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ధరల పెరుగుదల వల్ల ఈజిప్ట్, హైతీ తదితర దేశాల్లో అల్లర్లు జరుగుతున్నాయని, ఇవి మరింత విస్తరించే ప్రమాదం ఉందన్నారు.
ఇలాంటి అల్లర్లు ఆ దేశాలకే కాకుండా ప్రపంచానికే ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. అందువల్ల ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు మార్గాలను అన్వేషించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిన ధరల వల్ల ప్రజల పక్షాల నిలిచే ప్రభుత్వాలతో పాటు పలు ప్రజాస్వామ్య దేశాలకు ఈ పరిణామం పెద్ద ముప్పుగా పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రజల, ప్రజాస్వామ్యాలకు హాని కలిగిస్తే దేశాల మధ్య యుద్ధాలు జరుగవచ్చని స్ట్రాస్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ధరలను అరికట్టేందుకు ప్రపంచ దేశాలతో పాటు.. ఆర్థిక సంస్థలు, ప్రైవేటు రంగాలు, ప్రభుత్వాలు కలసికట్టుగా పని చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.
|