నేపాల్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తామని నేపాల్ మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈనెల పదో తేదీన జరిగిన సాధారణ ఎన్నికల్లో తమకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, వారి అభీష్టం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, నాయకత్వం వహిస్తామని మావోయిస్టుకు చెందిన సమాచార శాఖ మంత్రి కృష్ణ బహదూర్ మహారా వెల్లడించారు. ఎన్నికల తుది ఫలితం వచ్చాక మావోయిస్టుల ఆధ్వర్యంలో నేపాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.
కొత్త ప్రభుత్వంలో పూర్తి బాధ్యతలు చేపట్టాల్సిందిగా దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారని మహారా అభిప్రాయపడ్డారు. మహారా ప్రకటన వెలువడిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలు దేశం నలుమూలలా సంబరాలు జరుపుకున్నారు. ఇదిలావుండగా ఖాట్మండులో విజయం సాధించిన ప్రచండ విజయయాత్రలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని తిలకించేందుకు ప్రజలు బారులు తీరారు. చెట్లు, గోడలు, భవనాలపై ఉండి ర్యాలీని తిలకిస్తున్నవారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
|