సోమాలియా దేశ రాజధాని మొగదిషులో ఇథియోపియా దళాలకు, ఇస్లాంమత తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో సుమారు 81 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్ర గాయాల పాలయ్యారు. గత రెండు రోజులుగా ఇథియోపియా దళాలకు, ఇస్లాం మత తీవ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి. నివాసిత ప్రాంతాల్లో ఈ రెండు వర్గాలు మారణాయుధాలతో పాటు.. చిన్నపాటి ఫిరంగులతో దాడులకు దిగారు.
ఈ దాడుల్లో స్థానిక ప్రజలు చిక్కుకోవడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. సామాన్య ప్రజానీకంపై దాడులు జరిపిన ఇథియోపియా దళాల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సోమాలియా మానవ హక్కుల సంఘం ఛైర్మన్ సుడాన్ ఆలీ అహ్మద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దాడుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ఇథియోపియా దళాలకు, ఇస్లాంమత తీవ్రవాదుల మధ్య మళ్లీ ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉడటంతో బందోబస్తును మరింత పటిష్టం చేశారు. ఇథియోపియాలో గత 1991 వరకు సైనిక పాలన సాగింది. ఈ పాలనకు స్వస్తిపలికిన ఐక్య సోమాలియా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇస్లాంమత తీవ్రవాద సంస్థకు చెందిన ఒక వర్గం పోరాటం చేస్తోంది. వీరి ఆగడాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఇథియోపియా సేనలను అక్కడ మొహరించారు.
|