తీవ్రవాద సంస్థల జాబితా నుంచి సీపీఎన్ (మావోయిస్టు) పార్టీ పేరును అమెరికా త్వరలో తొలగించనుంది. ఇందుకోసం అగ్ర దేశం చర్యలు చేపట్టినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. నేపాల్ ఆపద్ధర్మ ప్రభుత్వ స్పీకర్ సుభాష్ నెమ్‌వాంగ్‌తో సింఘా దర్బార్‌లో యూఎస్ రాయబారి నాన్సీ జె.పావెల్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య శాంతి ఒప్పందంతో పాటు.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై చర్చించినట్టు నేపాల్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అమెరికా వద్ద ఉన్న తీవ్రవాద సంస్థల జాబితాలో సీపీఎన్ (మావోయిస్టు) పార్టీ పేరు ఉంది. దీన్ని తొలగించేందుకు అమెరికా చర్యలు చేపడుతుందని నాన్సీ పావెల్ సూచనప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. రెండు దశాబ్దాల తుపాకి పోరాటం అనంతరం మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలసి, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మావోయిస్టులు నేపాల్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా రాజ్యాంగ అసెంబ్లీకి ప్రత్యక్ష పద్ధతిలో 240 సీట్లకు జరిగిన ఎన్నికల్లో మావోయిస్టులు 120 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెల్సిందే. కొత్తగా మావోయిస్టు నేతృత్వంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వానికి ఎప్పటిలా సహాయ సహకారాలు అందిస్తామని అమెరికా రాయబారి హామీ ఇచ్చారు. వచ్చే వారంలో అమెరికాకు వెళ్లనున్న పావెల్.. నేపాల్‌లో జరిగిన రాజ్యాంగ ఎన్నికల ప్రక్రియను అమెరికా ప్రభుత్వానికి వివరిస్తారు. ఆ తర్వాత నేపాల్ పట్ల అమెరికా అనుసరించాల్సి భవిష్యత్ ప్రణాళికను ఖరారు చేయవచ్చని స్పీకర్ నెమ్‌వాంగ్ చెప్పారు.
|