పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పట్టభద్రులు మాత్రమే పోటీ చేయాలంటూ ఆ దేశ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన చట్టాన్ని పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం పట్టభద్రులై ఉండాలని నిర్ణయించిన ముషారఫ్.. ఆ మేరకు 2002 సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసి ఒక చట్టాన్ని రూపొందించారు. దీనిపై సమీక్షించిన పాక్ సంకీర్ణ సర్కారు ఆ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ హమీద్ డోగర్ నేతృత్వంలో కూడిన ఏడుగురు సభ్యులు గల ధర్మాసనం ఏకగ్రీవంగా ముషారఫ్ చేసిన చట్టాన్ని రద్దు చేసింది. పాకిస్థాన్‌లో పిపిపి-పీఎంఎల్ (ఎన్) పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదొకటి కావడం గమనార్హం.
ఇప్పటికే ముషారఫ్ తొలగించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తిరిగి నియమించేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇలా ముషారఫ్ గతంలో తీసుకున్న ఒక్కో నిర్ణయంపై పాక్ ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తూ రద్దు చేయడానికి మొగ్గు చూపుతోంది.
|