పాకిస్థాన్‌లో కొత్తగా కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు పొడచూపాయి. వీటిపై పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముషారఫ్ తొలగించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పునర్నియామకం అంశం సత్వరం ఒక కొలిక్కి రానిపక్షంలో మంత్రివర్గం నుంచి తప్పుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పదవి నుంచి తొలగించిన ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరితో పాటుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పునర్నియామకం త్వరితగతిన పూర్తిచేయాలని నవాజ్ షరీఫ్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ అంశంపై పిపిపి ఆచితూచి అడుగులు వేస్తోంది. తాను అవినీతి ఆరోపణల బారిన పడి జైలు పాలైనప్పుడు తన పట్ల ఏమాత్రం కనికరం చూపని సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పట్ల పిపిపి కో-ఛైర్మన్ అసిఫ్ ఆలీ జర్దారీ బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెలరోజులు కూడా పూర్తిగాక ముందే సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక పార్టీల మధ్య విభేదాలు తలెత్తడం పాక్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ పరిణామాలపై చర్చించేందుకు నవాజ్ షరీఫ్ తన అనుచరులతో సోమవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకే అందరూ మొగ్గు చూపినట్టు ఆ దేశ మీడియా వర్గాలు తెలిపాయి.
అయితే సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలిగినప్పటికీ పిపిపికి మద్దతు కొనసాగించాలని పిఎమ్ఎల్ (ఎన్) తీర్మానించింది. గత ఫిబ్రవరి 18న జరిగిన ఎన్నికల్లో ఏ పక్షానికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ-పీఎంఎల్ (ఎన్) పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, పిపిపి సీనియర్ నేత గిలానీ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే.
|