ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌పై జరిగిన హత్యాయత్న దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా కాబూల్‌లో తిష్టవేసిన తీవ్రవాదుల ఏరివేతకు అవసరమైన సహాయ సహకారాలను సమితి అందిస్తుందని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ హామీ ఇచ్చారు. దీనిపై మూన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాబూల్ 16వ వార్షికోత్సవాల్లో హాజరయ్యేందుకు వచ్చిన అధ్యక్షుడు కర్జాయ్‌పై తాలిబాన్ తీవ్రవాదులు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
దేశంలో జరిగే సహేతుక దాడులను తాము ఎట్టిపరిస్థితుల్లోను అంగీకరించబోమన్నారు. అంతేకాకండా.. ఆఫ్గాన్ పునర్నిర్మాణానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఐరాస కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే తక్షణం స్పందించి పెను ముప్పు నుంచి దేశాధ్యక్షుడుని కాపాడిన ఆఫ్గాన్ భద్రతా బలగాలను మూన్ అభినందించారు.
అంతేకాకుండా ఎలాంటి ప్రాణ నష్టం కలుగకుండా చేయడమే గాక, కార్యక్రమానికి హాజరైన విదేశీ, స్వదేశీ ప్రతినిధులను రక్షించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేసారు. అంతేకాకుండా ముగ్గురు తీవ్రవాదులను ఆఫ్గాన్ భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ కాల్పులకు తాలిబాన్ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించిన విషయం తెల్సిందే.
|