నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవించాలని నేపాల్ ప్రధాని, నేపాల్ కాంగ్రెస్ ఛైర్మన్ గిరిజా ప్రసాద్ కోయిరాలా ఆ దేశ రాజకీయ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దేశ ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రభుత్వ మార్గదర్శకాల ఖరారు కోసం పార్టీలు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని ఆయన కోరారు. అంతేకాకుండా తుది ఫలితం వెల్లడైన మూడు వారాల్లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న రాజ్యాంగ నిబంధనకు అన్ని పార్టీలు కట్టుబడి ముందుకు సాగాలని కోయిరాలా విజ్ఞప్తి చేశారు.
గత 1990 సంవత్సరంలో మావోయిస్టులకు, నేపాల్ రాజకీయ పార్టీల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మేరకు దేశంలోని రాజరికాన్ని రద్దు చేసి, గణతంత్ర దేశంగా ప్రకటించాలన్న అంశానికి తాత్కాలిక రాజ్యాంగంలో తొలి ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని కోయిరాలా గుర్తు చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ 110 స్థానాలను గెలుచుకుని ద్వితీయ స్థానంలో ఉంది.
అలాగే.. 220 స్థానాలతో మావోయిస్టులు అతిపెద్ద పార్టీగా అవతరించారు. అయితే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు మావోయిస్టు చీఫ్ ప్రచండ చేసిన ప్రతిపాదనను తృతీయ స్థానంలో ఉన్న యూఎంఎల్ పార్టీ నేతలు అంగీకరించడం లేదు.
|