పాకిస్థాన్ సంకీర్ణంలో విభేదాలు మళ్లీ తలెత్తాయి. అధ్యక్షుడు ముషారఫ్ తొలగించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తక్షణం పునర్నియమించాలని సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామ్య పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) కో-ఛైర్మన్ ఆసిఫ్ ఆలీ జర్ధారీ ససేమిరా అంటున్నారు. రాజ్యాంగ సంస్కరణలు చేపట్టిన తర్వాతే న్యాయమూర్తుల పునర్నియామకం చేపట్టాలని పట్టుబట్టారు.
దీంతో ఆగ్రహించిన నవాజ్ షరీఫ్, పిపిపి కో-ఛైర్మన్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. అంతేకాకుండా ఈనెల 30వ తేదీలోగా తొలగించిన న్యాయమూర్తులను నియమించక పోతే క్యాబినెట్‌లో ఉన్న తమ పార్టీకి చెందిన మంత్రులు రాజీనామాలు చేస్తారని పీఎంఎల్ (ఎన్) పార్టీ హెచ్చరించింది. న్యాయమూర్తుల నియామకంతో దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో 90 శాతం మేరకు పరిష్కారమవుతాయని పీఎంఎల్ (ఎన్) నేత జావేద్ హష్మీ అభిప్రాయపడ్డారు.
ఇదిలావుండగా షరీఫ్ పార్టీ విధించిన గడువు దగ్గర పడటంతో ఇరు పార్టీలకు చెందిన నేతలు దుబాయ్‌లో సోమవారం సమావేశమై చర్చలు జరిపారు. అయినప్పటికీ న్యాయమూర్తుల పునర్నియామకంపై ఇరు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. దీంతో సమస్య జఠిలంగా మారింది. షరీఫ్ విధించిన గడువు బుధవారంతో ముగియనుంది.
|