కేంద్ర విదేశాంగ శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ పాకిస్థాన్ పర్యటనతో పాక్‌లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జీత్ సింగ్‌కు విముక్తి కలుగవచ్చని ముద్దాయి కుటుంబ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 1990 సంవత్సరంలో పంజాబ్ ప్రొవియన్స్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు సరబ్‌జీత్ కారణమంటూ స్థానిక కోర్టు ఆయనకు మరణదండన విధించిన విషయం తెల్సిందే.
అయితే ఈ శిక్ష అమలును కేంద్రం విజ్ఞప్తి మేరకు పాక్ ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెలలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ సమయంలో సరబ్ అంశంతో పాటు ఉభయదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్-పాకిస్థాన్-భారత్ గ్యాస్ పైపు నిర్మాణం తదితర అంశాలు చర్చకు రానున్నాయి.
ముఖ్యంగా సరబ్‌జీత్‌కు ప్రాణభిక్ష పెట్టాలని కేంద్రంతోపాటు, పాకిస్థాన్ మానవ హక్కుల సంఘం దాయాది దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదిలావుండగా ఉనికి, ఊపిరి మధ్య కొట్టుమిట్టాడుతున్న సరబ్‌జీత్‌ను ఆయన కుటుంబ సభ్యులు గత 18 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని పాక్ ప్రభుత్వం కల్పించింది.
దీంతో ముద్దాయి భార్యా పిల్లలు, సోదరి దల్బీర్ కౌర్‌లు పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. వారు అధ్యక్షుడు ముషారఫ్, ప్రధాని గిలానీ, పిపిపి నేత జర్ధారీ, పీఎంఎల్ (ఎన్) నేత షరీఫ్‌లను కలుసుకొని సరబ్‌జీత్‌కు ప్రాణదానం చేయాలని మొరపెట్టుకుంటున్నారు.
|