బ్రిటన్‌లో భారతీయ వైద్యులు విజయం సాధించారు. ఆ దేశంలోని వైద్య పోస్టుల భర్తీలో యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన వైద్యులు అందుబాటులో లేనపుడు మాత్రమే భారతీయులతో పాటు.. ఇతర దేశాలకు చెందిన వైద్య పట్టభద్రులకు ఉద్యోగాలు ఇవ్వాలని, గత 2006 సంవత్సరం ఏప్రిల్ నెలలో బ్రిటన్ ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ బ్రిటన్‌లోని భారతీయ వైద్యుల సంఘం (బీఐపీఐఓ) కోర్టులో సవాల్ చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన స్థానిక కోర్టు వైద్యుల సంఘానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును బ్రిటన్ ప్రభుత్వం ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానమైన 'హౌస్ ఆఫ్ లార్డ్స్'లో సవాల్ చేసింది. దీనిపై విచారించిన అత్యున్నత కోర్టు కూడా బ్రిటన్ ప్రభుత్వ అప్పీలును తోసిపుచ్చింది. ఈ తీర్పు బ్రిటన్‌లో ఉన్న వేలాది మంది విదేశీ వైద్యులకు ఊరట కలిగించింది.
దీనిపై బీఏపీఐఓ అధ్యక్షుడు రమేష్ మెహతా మాట్లాడుతూ ఇప్పటికైనా బ్రిటన్ ప్రభుత్వం తమపై వివక్ష చూపించకుండా న్యాయబద్ధంగా నడుచుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే.. మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగాలు భర్తీ చేస్తుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు.
|