పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) కొ-ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్ధారీకి ఉపశమనం లభించింది. ఆయనపై దాఖలై ఉన్న అన్ని అవినీతి కేసులను సింధ్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం ఆదేశించింది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబి) జర్ధారీపై పలు అవినీతి కేసులను నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులలో ఒక్కొక్కదాని నుంచి విముక్తి పొందుతూ వస్తున్న జర్ధారీకి మంగళవారం పూర్తి ఉపశమనం లభించింది.
తనపై నమోదైన కేసులను జాతీయ పునఃసమీక్ష చట్టం (నేషనల్ రీ-కన్సిలియేషన్ ఆర్డినెన్స్) కింద ఉప సంహరించాల్సిందిగా కోరుతూ జర్ధారీ సింధ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింధ్ హైకోర్టు.. ఎన్‌ఆర్‌ఓ చట్టం మేరకు కేసులను తొలగిస్తూ ఆదేశించినట్టు జియో టీవీ ఛానల్ పేర్కొంది.
|