అమెరికా అధ్యక్ష పీఠం కోసం డెమొక్రటిక్ పార్టీ తరపున జరుగుతున్న అభ్యర్థుల ఎన్నికల్లో నల్లజాతీయుడు బారక్ ఒబామా ముందంజలో ఉన్నాడు. మరో సూపర్ మంగళవారం రెండు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఒక చోట ఒబామా విజయం సాధించారు. మరో చోట ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు గట్టి పోటీ ఇచ్చి, స్వల్ప మెజారిటీతో పరాజయంపాలయ్యాడు.
ప్రైమరీల ఎన్నికల్లో భాగంగా మంగళవారం నార్త్ కరోలినా, ఇండియానా ప్రైమరీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో నార్త్ కరోలినా రాష్ట్రంలో ఒబామా గెలుపొందాడు. ఇక్కడ పోలైన 92 శాతం ఓట్లలో ఒబామాకు 56 శాతం ఓట్లు పోలుకాగా, క్లింటన్‌కు 42 శాతం ఓట్లు వచ్చాయి. అలాగే ఇండియానా ప్రైమరీలో పోలైన ఓట్లలో క్లింటన్‌కు 52 శాతం, ఒబామాకు 48 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ఇక్కడ ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాలేదు.
ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతినిధుల్లో ఒబామాకు 63 మంది, క్లింటన్‌కు 57 మంది డెలిగేట్ల మద్దతు లభించింది. మరో 67 మంది డెలిగేట్లు తమ మద్దతును తెలుపాల్సివుంది. ముఖ్యంగా నార్త్ కరోలినాలో ఉన్న శ్వేతజాతీయుల్లో 60 శాతం మంది మద్దతు లభించగా, ఇదే రాష్ట్రంలో ఉన్న నల్ల జాతీయుల్లో 90 శాతం మంది ఒబామాకు అండగా నిలిచారు.
|