రష్యా నూతన అధ్యక్షుడిగా ద్మిట్రీ మెద్వదేవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్రెమ్లిన్స్ సెయింట్ ఆండ్రూ హాల్‌లో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆ దేశ కాలమానం ప్రకారం 11 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమం గంట పాటు జరుగుతుందని ప్రెసిడెన్షియల్ హెరాల్డిక్ కౌన్సిల్ హెడ్ జార్జీ విలిన్‌బాఖోవ్ మంగళవారం విలేకరులకు తెలిపారు. గత మార్చి నెల రెండో తేదీన జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ద్మిట్రీ మెద్వదేవ్ విజయం సాధించినట్టు రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మంగళవారం ధృవీకరణ పత్రాన్ని అందజేసింది.
ఈ ఎన్నికల్లో మెద్వదేవ్ ఏకపక్ష విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈయనకు 70.28 శాతం ఓట్లు పోలయ్యాయి. కాగా, అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్న వ్లాదిమిర్ పుతిన్.. రష్యా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల ఎనిమిదో తేదీన జరుగనుంది. అలాగే అధికార పార్టీ అయిన యునైటెడ్ రష్యా పార్టీ అధినేతగా కూడా పుతిన్ ఎన్నిక కానున్నారు. ఈ పరిస్థితుల్లో పుతిన్ అధ్యక్ష హోదాలో తన చిట్టచివరి క్యాబినెట్ సమావేశాన్ని గత సోమవారం నిర్వహించారు.
ఇదిలావుండగా రష్యా అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు 1991, 1996, 2000, 2004 సంవత్సరాల్లో వివిధ చోట్ల జరిగాయి. రష్యా తొలి అధ్యక్షుడిగా బోరిస్ ఎల్సిన్ 1991 జూన్ 12వ తేదీన ఎన్నిక కాగా, 1991 జులై పదో తేదీన ప్రమాణ స్వీకారం చేసారు. అలాగే అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నికైన పుతిన్, రెండు దఫాలు వేర్వేలు ప్రదేశాలల్లో ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.
|