నర్గిస్ తుఫాను విలయతాండవానికి అల్లకల్లోలమైన మియన్మార్‌లో భారత్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. దీనికి 'ఆపరేషన్ సహాయత్' అని పేరు పెట్టారు. ఈనెల రెండు, మూడు తేదీల్లో మియన్మార్‌ను నర్గిస్ తుఫాను తాకిన విషయం తెల్సిందే. ఈ తుఫాను గాలులకు మియన్మార్‌లోని అనేక ప్రాంతాలు నేలమట్టమయ్యాయి.
ముఖ్యంగా.. తుఫానుకు సుమారు లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు అనధికార వర్గాల సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం 22,500 మంది మృతి చెందినట్టు, మరో 41 వేల మంది ఆచూకీ తెలియడం లేదు. ముఖ్యంగా ఇర్రవాడి డెల్టా ప్రాంతంలోని అన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో ఒక మిలియన్ ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
గత 1991 సంవత్సరం తర్వాత ఆసియా ఖండంలో సంభవించిన అతిపెద్ద తుఫాను నర్గిస్ కావడం గమనార్హం. అపుడు బంగ్లాదేశ్‌లో సంభవించిన తుఫానుకు 1.43 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దృశ్యాలు ప్రస్తుతం మియన్మార్‌లో కనిపిస్తున్నాయి. నర్గిస్ కారణంగా అల్లకల్లోలమైన మియన్మార్‌లో సహాయక చర్యలు చేపట్టేందుకు భారత్ అధిక చొరవ చూపిస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే ఐఏఎఫ్‌కు చెందిన రెండు ఎయిర్‌లిఫ్ట్ విమానాలు సహాయక సామగ్రిని తీసుకెళ్లాయి. మరో ఏఎన్-32 రకం ఎయిర్‌క్రాఫ్ట్ మందులు, గుడార సామగ్రిని తీసుకెళ్లింది. ఇవే కాకుండా ఇండియన్ నావీకి చెందిన మరో రెండు నౌకల్లో మందులు, ఆహార పదార్థాలు, గుడారాలు, దుస్తులను భారత్ పంపించింది. ఇవి ఇప్పటికే మియన్మార్ రాజధాని యాంగన్‌కు చేరుకున్నాయి. 'ఆపరేషన్ సహాయత్' పేరుతో భారత్ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయి.
|