పాకిస్థాన్ మరోసారి అణ్వస్త్ర క్షిపణిని ప్రయోగించింది. భూ మరియు సముద్ర లక్ష్యాలను ఛేదించే హతాఫ్-VIIIను పాకిస్థాన్ విజయవంతంగా ప్రయోగించింది. మొత్తం 350 కిలోమీటర్ల లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదిస్తుందని ఆ దేశ రక్షణ శాఖ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ మిస్సైల్‌ను ఎక్కడ నుంచి ప్రయోగించింది మాత్రం రక్షణ వర్గాలు వెల్లడించలేదు.
ఈ క్షిపణి అన్ని రకాల వార్ హెడ్స్‌ను మోసుకెళ్లే సమార్థ్యాన్ని కలిగి ఉన్నట్టు పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పాకిస్థాన్ రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరిందని ఆ వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ అణ్వస్త్ర క్షిపణి పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.
3,500 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే అగ్ని-3 క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించిన మురుసటి రోజే పాక్ హతాఫ్-VIIIను ప్రయోగించడం గమనార్హం. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, ప్రధాని గిలానీలు ఆ దేశ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
|