వైట్‌హౌస్ పీఠానికి వచ్చే నవంబరులో జరుగనున్న ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక కోసం జరుగుతున్న వివిధ ప్రైమరీల ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల పోరులో నల్ల జాతీయుడైన బారక్ ఒబమా తన అధిపత్యం చెలాయించారు. ఒబామా ముందు ఇక మిగిలింది నామినేషన్ దాఖలు ఘట్టమేనని రాజకీయ నిపుణులు చెపుతున్నప్పటికీ.. ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ మాత్రం చివరి వరకు పోరాటం సాగిస్తానని ఢంకా బజాయించి చెపుతోంది.
అధ్యక్ష పీఠం అభ్యర్థికి ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్, బారక్ ఒబామాలు పోటీ పడుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరు ఆది నుంచి నువ్వా నేనా అంటూ ఎన్నికల్లో గెలుపొందుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఇండియానాలోను, బారక్ ఒబామా నార్త్ కరోలినా రాష్ట్రాల్లో విజయం సాధించారు.
ఈ ఫలితాల అనంతరం ఇప్పటి వరకు ఒబామాకు 1840.50 మంది, హిల్లరీకి 1684 మంది ప్రతినిధుల మద్దతు లభించింది. అమెరికా అధ్యక్ష భవనం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలంటే మొత్తం ఉన్న ప్రతినిధుల్లో 2025 మంది మద్దతు తప్పని సరి. ఈ సంఖ్యకు ఒబామా మరి కొద్ది దూరంలో ఉన్నారు. ఈయన మరో 184.5 మంది ప్రతినిధుల మద్దతు గెలుచుకుంటే తన విజయానికి తొలి మెట్టును అధికమించినట్టే.
ఈ పరిస్థితుల్లో ఈనెల 13వ తేదీన పశ్చిమ వర్జీనియా, 20వ తేదీన అరెగాన్, కెంటకీ, జూన్ ఒకటో తేదీన ప్యూర్టోరికో, 3వ తేదీన మొంటానా, దక్షిణ డకోటా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రాష్ట్రాలన్నింటిలో హిల్లరీ విజయం సాధిస్తేనే ఆమె ఒబామాను తోసిరాజని అభ్యర్థి పదవికి నామినేషన్ దాఖలు చేయగలరు. లేదంటే హిల్లరీ పోటీ నుంచి తప్పుకోక తప్పదు.
|