రష్యా ప్రధానమంత్రిగా వ్లాదిమిర్ పుతిన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకాన్ని రష్యా పార్లమెంట్ గురువారం ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధాని పుతిన్ మాట్లాడుతూ.. దేశ జాతీయ భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు. అంతేకాకుండా రష్యా చేపట్టే అణ్వస్త్ర ప్రయోగాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. బాంబర్ విమానాలు, అణు క్షిపణి దళాలు, జలాంతర్గాముల్లో పని చేసే సైనిక సిబ్బందికి వేతనాలు పెంచనున్నట్టు ఆయన తెలిపారు.
నూతన అధ్యక్షుడు మెద్వదేవ్‌తో కలసి దేశ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మొన్నటి వరకు రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన పుతిన్, తన రెండో పర్యాయ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఆయన స్థానంలో, తనకు అత్యంత సన్నిహితుడైన ద్మిట్రీ మెద్వదేవ్‌ను నియమించారు. అలాగే మెద్వదేవ్ నిర్వహిస్తున్న ప్రధానమంత్రి బాధ్యతలను పుతిన్ చేపట్టారు.
సాధారణంగా రష్యా ప్రధాని కంటే అధ్యక్షుడికి మరిన్ని అధికారాలు ఉంటాయి. అయితే పుతిన్ అధ్యక్ష పదవిని కాదని, ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మెద్వదేవ్ మాట్లాడుతూ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాని పుతిన్ దేశ వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తారని ప్రకటించారు.
|