గతంలో పాకిస్థాన్ సైనిక ప్రభుత్వం తొలగించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పునర్నియామకంపై పాకిస్థాన్ సంకీర్ణ కూటమి ప్రభుత్వ అగ్రనేతలు లండన్‌లో సమావేశమయ్యారు. జడ్జీల పునర్నియామకంపై రూపొందించిన ముసాయిదాపై వీరు చర్చించారు. ఈనెల 12వ తేదీలోగా జడ్జీల నియామకం చేపట్టాలని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గడువు విధించిన విషయం తెల్సిందే. జాతీయ అసెంబ్లీ లేదా పార్లమెంట్ దిగువ సభలో ఒక తీర్మానం చేసిన తర్వాత మే 12వ తేదీలోగా జడ్జీల పునర్నియామకం చేపట్టాలని షరీఫ్ కోరారు.
అయితే దీనికి జర్ధారీ నుంచి సరైన సమాధానం రాలేదు. ఇదిలావుండగా గత ఎమర్జెన్సీ సమయంలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వ న్యాయవాదులు తొలగించిన జడ్జీల పునర్నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది 60 మందితో కూడిన న్యాయవ్యస్థను రద్దు చేసిన విషయం తెల్సిందే. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తీకార్ మహ్మద్ చౌదరీ కూడా ఉన్నారు. వీరి నియామకానికి ప్రస్తుత న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.
|