ఇండో-యూఎస్ అణు ఒప్పందంపై దేశంలోని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం తప్పనిసరని కేంద్ర వాణిజ్య శాఖామంత్రి కమల్‌నాథ్ అన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఆసియా సొసైటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అణు ఒప్పందం అమలుకు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని మంత్రి నొక్కి వక్కాణించారు.
భారత్, అమెరికా దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం అమలుకు వస్తే భారత్‌లో విద్యుత్ అవసరాలు చాలావరకు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆయా దేశాల అభివృద్ధి కోసం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు మాత్రం ప్రభుత్వాలు, ప్రధానులు మారినప్పటికీ కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్‌లో 5000 మెగావాట్‌ల పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దీన్ని మరింత ఉత్పత్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి కమల్‌నాథ్ వెల్లడించారు.
|