హిమాలయ దేశమైన నేపాల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆ దేశ రాజకీయ పార్టీలు కసరత్తులు చేపట్టాయి. ఇందులోభాగంగా నేపాలీ కాంగ్రెస్ అధినేత, ప్రధాని గిరిజా ప్రసాద్ కోయిరాలా అధికారిక నివాసంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు శుక్రవారం భేటీ అయ్యారు.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో విజయం సాధించిన సీపీఎన్-ఎం అధినేత ప్రచండతో పాటు సీపీఎన్ (యుఎంఎల్), యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్, నేపాల్ వర్కర్స్ అండ్ పీజెంట్స్ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల్లో ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాలు, రాజరిక వ్యవస్థ రద్దు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, విధి-విధానాల ఖరారు, వివిధ పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చలు జరిపారు.
అలాగే రాజ్యాంగ సభ తొలి సమావేశం నిర్వహించే తేదీని కోయిరాలా సూచించాలని రాజకీయ పార్టీల నేతలు కోరారు. కొత్త మంత్రివర్గ ఏర్పాటుపై పార్టీల నేతలు చర్చించారు. సమావేశానంతరం నేపాలీ కాంగ్రెస్ ప్రచార విభాగ అధికార ప్రతినిధి ప్రకాష్ శరణ్ మహత్ మాట్లాడుతూ.. రాజ్యాంగ సభ తొలి సమావేశ తేదీని ఖరారు చేసే బాధ్యతను ప్రధాని కోయిరాలాకే కట్టబెట్టారని చెప్పారు. అలాగే కీలక అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎలా ముందుకెళ్లాలనే విషయంపై సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కూడా కోయిరాలాను కోరినట్టు మహత్ వివరించారు.
|