మరణశిక్ష ఎదుర్కోనున్న భారత ఖైదీ సరబ్‌జీత్ సింగ్‌కు క్షమాభిక్ష ప్రసాదించే విషయాన్ని పాక్ ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆ దేశ ప్రధాని యూసఫ్ రజా గిలానీ సూచన ప్రాయంగా వెల్లడించారు.
సరబ్‌జీత్ కేసుపై తమ దేశ విదేశీ వ్యవహారాలు, అంతర్గత, న్యాయశాఖ, మానవ హక్కుల మంత్రిత్వ శాఖలు సమీక్ష జరుపుతున్నాయని గిలానీ తెలిపారు. ఆయన శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. సరబ్‌జీత్ ప్రాణదానానికి అర్హుడా కాదా అనే విషయాన్ని ఆయా శాఖలు నిర్ణయించి, తుది నిర్ణయం తీసుకుంటాయన్నారు.
అప్పటి వరకు మరణశిక్షను అమలుచేయవద్దని దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను కోరినట్టు గిలానీ తెలిపారు. 1990లో లాహోర్‌లో జరిగిన బాంబు పేలుళ్ళ కేసులో సరబ్‌జీత్ దోషిగా తేలడంతో పంజాబ్ కోర్టు మరణ శిక్షను విధించింది. దీంతో సరబ్ గత 18 సంవత్సరాలుగా పాక్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
|