కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ మూడు రోజుల గల్ఫ్ దేశాల పర్యటన చేపట్టారు. ఇందులోభాగంగా ఆయన సోమవారం దుబాయ్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అరబ్ ఎమిరేట్స్ నేతలతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు.
దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌కు చేరుకున్న ముఖర్జీకి స్థానిక విమానశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విమానశ్రయంలో యూఏఈలోని భారత రాయబారి తాల్‌మిళ్ అహ్మద్, కౌన్సిల్ జనరల్ వేణు రాజమణితో సహా యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. ప్రణబ్ ముఖర్జీ తన పర్యటనలో యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫ్ బిన్ జయాద్ అల్ నహ్యాన్, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్ బిన్ జయాద్, అబుదాబి రాజు షేక్ మొహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్‌లతో భేటీ కానున్నారు.
ఉభయదేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో భాగంగానే ముఖర్జీ పర్యటన సాగుతోందని భారత రాయబారి చెప్పారు. అంతేకాకుండా ఈ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోక పోయినప్పటికీ.. రాజకీయ, ఆర్థిక సంబంధాలపై ఇరు దేశాల మంత్ర్రులు చర్చలు జరుపుతారని చెప్పారు.
|